వామ్మో.. సరిగ్గా నిద్రపోవడం లేదా..? ఈ విషయం తెలిస్తే వెన్నులో వణుకు ఖాయం..!
మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆహారం, నీరు, వ్యాయామం ఎంత ముఖ్యమో, అంతే ప్రాధాన్యం నిద్రకు కూడా ఉంది. రాత్రిపూట నిద్రను నిర్లక్ష్యం చేస్తే అది ఆరోగ్యాన్ని మానసికంగా శారీరకంగా ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా జరిగిన కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. నిద్ర లేకుండా నిరంతరం ఉండేవారి మెదడు ఒక పరిస్థితిలో తనని తానే హానిచేసుకునే పరిస్థితి వస్తుందట. ఇది వింటే ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నిజమే.

నిద్రలో శరీరం విశ్రాంతి పొందటమే కాదు.. మెదడు కూడా కొన్ని ముఖ్యమైన పనులను చేస్తుంది. రోజంతా మనం చేసిన పనుల వల్ల మెదడులో ఏర్పడే చెత్తను శుభ్రం చేయడంలో మెదడు కణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరమైన పని. అయితే తగినంత నిద్ర లేకపోతే ఆ పనులు ఎక్కువైపోయి.. ఆరోగ్యంగా ఉన్న మెదడు భాగాలకూ హాని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2017లో ప్రచురించిన ఒక న్యూరోలాజికల్ అధ్యయనంలో తక్కువ నిద్ర కారణంగా మెదడులో ఆస్ట్రోసైట్స్ అనే కణాలు ఎక్కువగా పనిచేస్తాయని తెలిసింది. ఇవి సాధారణంగా పనికిరాని నర సంబంధాలను తొలగించడానికి పనిచేస్తాయి. కానీ నిద్రలేమి ఉన్నప్పుడు.. ఇవి ఆరోగ్యంగా ఉన్న సంబంధాలనూ దెబ్బతీయడం ప్రారంభిస్తాయి. దీని వల్ల మెదడు పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది.
అదేవిధంగా మైక్రోగ్లియా అనే మరో రకం కణాలు కూడా ఎక్కువగా చురుకుగా మారతాయి. ఇవి అల్జీమర్స్ లాంటి మెదడు జబ్బుల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఈ కణాల పనితీరు అదుపు తప్పి మెదడు కణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.
నిద్రపోవడం అంటే శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడమే కాదు.. మెదడుకూ విశ్రాంతిని ఇవ్వడమే. ఇది మరుసటి రోజు మనలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తిని మెరుగుపరచడానికి అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మనలో అలసట, మతిమరుపు, ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
సరైన నిద్ర తీసుకోవడం వల్ల మన మెదడులోని చెత్త కణాలు సకాలంలో తొలగించబడి.. ఆరోగ్యవంతమైన మెదడు పనితీరు కొనసాగుతుంది. మనం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం వల్ల శరీరం ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నా వేగంగా కోలుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
నిద్ర అనేది మన ఆరోగ్యానికి పునాది. దీన్ని తక్కువ చేసి భావించడం వల్ల ముఖ్యంగా యువతలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు తన పని చేస్తూ ఉండాలంటే.. దానికి అవసరమైన విశ్రాంతిని మనం ఇవ్వాలి. ప్రతిరోజూ తగినంత నిద్ర తీసుకుని ఆరోగ్యంగా జీవించండి.