పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలన్నీ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. డార్లింగ్ నటించిన లాస్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మైథలాజికల్ డ్రామాలో డార్లింగ్ రాముడిగా కనిపిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
వీటితో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలెక్స్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ నుంచి మరో సినిమా కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ తో మరో స్టార్ హీరోను కలిపి బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ప్రభాస్ తో నటించే ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిమించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.