Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. సిగరెట్ కాల్చిపారేయడంతో వ్యాపించిన మంటలు!!
కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద భారీ ఖర్చుతో ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ ఏర్పాటుచేశారు. ఇప్పుడీ సెట్ మొత్తం మంటల్లో కాలిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా సెట్‌లో కాదు.. గతేడాది రిలీజైన ఆచార్య సినిమా సెట్‌లో. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద భారీ ఖర్చుతో ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ ఏర్పాటుచేశారు. ఇప్పుడీ సెట్ మొత్తం కాలిపోయింది. కొణిదెల ప్రొడక్షన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఐతే.. విజువల్ వండర్‌లా ఉన్న ఈ సెట్‌ను షూటింగ్ తర్వాత తీసేయకుండా అలాగే ఉంచేశారు. ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో ఉన్నది కావడంతో సెట్ అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ మంటలు చెలరేగాయి. 2022 ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం ముందుగానే భారీ టెంపుల్ సెట్ వేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో అప్పట్లో దీన్ని రెడీ చేయడం హైలైట్. గాలి గోపురం, మొదలు ప్రతిదీ ప్రత్యేక జాగ్రత్త తీసుకుని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌తో ఈ సెట్ వేశారు. ఇందుకోసం దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడీ సెట్ ఇప్పుడు అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయి..? నిప్పు ఎక్కడ నుంచి వచ్చింది..? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓ వ్యక్తి ఈ సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో ఇలా బుగ్గిపాలైనట్లు తెలుస్తోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషించారు.
ఆచార్య సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో పాటు అంతకు మించిన భారీ సెట్లతో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇందులోని ధర్మస్థలి టెంపుల్ సెట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సెట్ అగ్ని ప్రమాదానికి ఆహుతైంది. ఆచార్య తర్వాత చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.





Acharya Movie Set
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..