Shaakuntalam: ‘శాకుంతలం సినిమాకు మోహన్‌బాబు నా ఛాయిస్ కాదు’.. డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. గతంలో తాను తెరకెక్కించిన ఓ సినిమాలో కీలకపాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించగా.. సున్నితంగా రిజెక్ట్ చేశారని అన్నారు. అలాగే ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న శాకుంతలం చిత్రంలోని దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్ బాబు తన ఛాయిస్ కాదన్నారు.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. మలయాళి నటుడు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో రూపొందించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, అల్లు అర్హ కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. గతంలో తాను తెరకెక్కించిన ఓ సినిమాలో కీలకపాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించగా.. సున్నితంగా రిజెక్ట్ చేశారని అన్నారు. అలాగే ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న శాకుంతలం చిత్రంలోని దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్ బాబు తన ఛాయిస్ కాదన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ.. “శాకుంతలం సినిమాకు మోహన్ బాబు నా ఛాయిస్ కాదు.. మహాకవి కాళిదాసు ఛాయిస్. ఎందుకంటే.. కాళిదాసు వర్ణన చదివిన తర్వాత.. దుర్వాస మహర్షి పాత్రకు నూటికి నూరు శాతం ఆయనే న్యాయం చేయగలరని అనిపించింది. గతంలో రుద్రమదేవిలో ఓ పాత్రకు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు.. దాంతో ఆరోజు ఆయన్ని బలవంతం చేయలేదు. కానీ శాకుంతలం అనుకున్నాక.. ఆయన్ను కలిశాను. సర్.. ఈసారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను.. ఒకవేళ మీరు చేయను అంటే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి ? అని అడిగాను. దానికి ఆయన ప్రాజెక్ట్ ఎంటీ ? అని అడిగారు..
శాకుంతలంలో దుర్వాస మహర్షి పాత్రని చెప్పాను.. వెంటనే ఆయన పెద్దగా నవ్వి.. కోపిష్టి అని నా వద్దకు వచ్చావా ? అని అడిగారు.. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని బదులిచ్చాను.. దానికి ఆయన.. ఈ పాత్ర నేనే చేస్తానంటూ అంగీకారం తెలిపారు ” అంటూ చెప్పుకొచ్చారు.