AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరు..

ఏపీ అసెంబ్లీలో జరిగిన సంభాషణపై చిరంజీవి స్పందించారు. జగన్‌తో మీటింగ్‌కి ముందు తర్వాత పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు. టికెట్ల రేట్ల పెంపుపై ఏపీతో చర్చలు జరపాలని అప్పట్లో నిర్మాతలు, ఫిల్మ్‌ చాంబర్‌ ప్రతినిధులు తనను కోరినట్లు వివరించారు. వాళ్ల సూచనల ప్రకారం పేర్ని నానితో మాట్లాడి జగన్‌ అపాయింట్‌మెంట్ కోరామన్నారు. తన చొరవ వల్లనే ఏపీలో టికెట్ల రేటు పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందని వివరించారు. చిరంజీవి విడుదల చేసిన పత్రికా ప్రకటన యథాతథంగా మీ కోసం...

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరు..
Balakrishna Vs Chiranjeevi
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2025 | 7:26 PM

Share

“సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ  స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా  గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ.. ఆయనంత  పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట” అంటూ ఒకింత వ్యంగ్యంగా  చెప్పడాన్ని నేను టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక  నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు – తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని  కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు.  వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి “ ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టూ వన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్నినాని గారు నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను.  ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు  ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని  అందరికీ తెలియచేస్తున్నాను.”