Shaakuntalam Review: శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధకు దృశ్యరూపం శాకుంతలం.. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే.
చాలా రోజుల నుంచి శాకుంతలం సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సమంత దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.. పైగా గుణశేఖర్ కూడా తాను ఓ ఎపిక్ తీసానంటున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాలో అంత అద్భుతం దాగుందా..? మహాభారత కాలం నాటి శకుంతల, దుశ్యంతుల...
చాలా రోజుల నుంచి శాకుంతలం సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సమంత దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.. పైగా గుణశేఖర్ కూడా తాను ఓ ఎపిక్ తీసానంటున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాలో అంత అద్భుతం దాగుందా..? మహాభారత కాలం నాటి శకుంతల, దుశ్యంతుల కథను గుణశేఖర్ ఎంతవరకు మెప్పించారో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
మూవీ రివ్యూ: శాకుంతలం
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు తదితరులు
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకుడు : గుణశేఖర్
నిర్మాతలు: నీలిమ గుణ, దిల్ రాజు
కథ:
దుష్యంతుడు (దేవ్ మోహన్) పుర సామ్రాజ్య మహారాజు. ఒకసారి ఊరి మీదకు పులులు దాడి చేస్తుంటే వాటి నుంచి జనాన్ని కాపాడుతాడు. అలా వేట సాగిస్తుండగా.. అనుకోకుండా కణ్వ మహర్షి (సచిన్ ఖేడేకర్) ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్కడ సౌందర్యాన్ని చూస్తూ అలాగే ముగ్ధుడైపోతాడు దుశ్యంతుడు. అలా చూస్తుండగానే అతడి కంటికి శకుంతల (సమంత) కనిపిస్తుంది. ఆమె రూపాన్ని చూసి అలాగే ఉండిపోతాడు.. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. శకుంతల కూడా దుష్యంతుడిని చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. ఆ తర్వాత శకుంతల గర్భం దాలుస్తుంది. తిరిగి రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన దుశ్యంతుడు.. ఎన్నాళ్లైనా రాడు. దాంతో తానే రాజ్యానికి వెళ్తుంది శకుంతల. కానీ అతడు ఆమెను గుర్తించడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలేమైంది..? ప్రాణంగా ప్రేమించిన శకుంతలను దుశ్యంతుడు ఎందుకు గుర్తించలేకపోతాడు అనేది అసలు కథ..
కథనం:
మహాభారతంలోని ఆదిపర్వంలోకి వెళ్లి.. శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను తీయాలని ఫిక్సయ్యాడు గుణశేఖర్. తాను అనుకున్న కథను స్క్రీన్ మీద బాగానే చూపించాడు. కాకపోతే కథ వరకు మాత్రమే బాగా ఆవిష్కరించాడు ఈయన. అసలైన విజువల్ ఫీస్ట్ మాత్రం ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చేయడానికి చాలా అనుభవంతో పాటు.. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండాలి. వాటిని ఉపయోగించుకోవడంలో గుణశేఖర్ అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయినా ఈ రోజుల్లో పౌరాణికం తీయడం అంత ఈజీ కాదు.. కానీ ఆ సాహసం చేశాడు దర్శకుడు గుణశేఖర్. అదే శాకుంతలం.. కాకపోతే అందులో సగమే సక్సెస్ అయ్యాడు ఈయన. తెలిసిన కథ కావడంతో కొత్తగా చెప్పడానికి ఏం లేకుండా పోయింది.. చిన్న అంకాన్ని తీసుకొని.. ఈ సినిమా చేశాడు గుణశేఖర్.
తనవరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు. కాకపోతే ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగడం శాకుంతలంకు ప్రధానమైన మైనస్. ఇంటర్వెల్ తర్వాత కానీ కథలో కాస్త వేగం పుంజుకోదు. దానికి తోడు గ్రాఫిక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో బాగా నచ్చే విషయం.. ప్రతీ క్యారెక్టర్ వచ్చే ముందు.. వాటి ఇంట్రడక్షన్ పక్క వాళ్ళతో ఇప్పించడం.. కాలినేమి, దుర్వాసుడు.. ఇలా ఎన్నో పాత్రలు ఇందులో ఉన్నాయి. వాటి ఉపోద్ఘాతం ఒక క్యారెక్టర్ అడుగుతుంటే.. మరో క్యారెక్టర్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. యుద్ధ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. పైగా ఏదో కావాలని ఇరికించినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా చూసుకుంటే శకుంతల దుశ్యంతుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. దాన్ని విజువలైజ్ చేయడంలో గుణశేఖర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
నటీనటులు:
శకుంతల పాత్రకు సమంత న్యాయం చేసింది.. కాకపోతే ఎందుకు ఆమె క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపించింది. ఉన్నంత సేపు మాత్రం స్యామ్ ప్రాణం పోసింది. సెకండాఫ్ ఆమె నటన బాగుంది. గ్లామరస్‌గానూ కనిపించింది సమంత. సినిమా అంతా దుశ్యంతుడే ఉన్నాడు.. దేవ్ మోహన్ ఈ క్యారెక్టర్ బాగా చేశాడు. కాకపోతే ఇంత లెంతీ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా తెలుగు హీరో చేసి ఉంటే ఇంకా బాగుండేది. చివర్లో భరతుడి పాత్రలో వచ్చే అల్లు అర్హ అద్భుతంగా చేసింది. తన బుడిబుడి అడుగులు.. చిట్టి పొట్టి మాటలతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
మణిశర్మ మ్యూజిక్ పర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. పాటలు మాత్రం మణిశర్మ పాత సినిమాలను గుర్తు చేసాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. శేఖర్ వి జోసెఫ్ ఉన్నంతలో బాగానే మ్యానేజ్ చేసాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా వీక్. మొదటి గంట చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇక దర్శకుడు గుణశేఖర్ జస్ట్ ఓకే అనిపించాడు కానీ.. ఆహా ఓహో అనిపించలేకపోయాడు. ఈ కథను విజువలైజ్ చేయాలంటే చూపు తిప్పుకోలేనంత మ్యాజిక్ ఉండాలి.. అది చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నిర్మాతగా మాత్రం గుణశేఖర్ చాలా ఖర్చు చేసాడు. కానీ అది స్క్రీన్ మీద అంత బాగా కనిపించలేదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా శాకుంతలం.. చరిత్ర తెలుసుకోవడానికి ఓకే..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..