Gujarat Elections 2022: దశాబ్దాలుగా బీజేపీదే హవా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక అంశాలు తెలుసుకోండి..
1995 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నింటిలోనూ బీజేపీయే విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది.
Know About Gujarat: గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో (Gujarat Elections 2022) జరగనున్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఆ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రధాని మోడీ అడ్డా, బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో పాగా వేయడం కోసం.. పకడ్బంధీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, మరోవైపు అధికార బీజేపీ కూడా తన అధికారాన్ని ఎలాంటి ఢోకా లేదని పూర్తి విశ్వాసంతో దూసుకెళ్తోంది. వరుసగా దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీ ఈ దఫా కూడా అధికారం తమదే అనే ధీమాతో ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమమే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని బీజేపీ ధృఢ విశ్వాసంతో ఉంది. ఇప్పటికే మోడీ, అమిత్ షా అనేక సార్లు గుజరాత్‌లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటూ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. కాగా.. బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికలపై దృష్టిసారించాయి. ఇప్పటికే రాహుల్, అరవింద్ కేజ్రీవాల్ పర్యటిస్తూ ఆయా పార్టీల క్యాడర్లలో ఉత్సాహం నింపుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎంఐఎం, ఎన్సీపీ, భారతీయ ట్రైబల్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
గుజరాత్ నేపథ్యం..
గుజరాత్.. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటకం, ఇలా అన్ని రంగాలలో దూసుకెళ్తోంది. భారతదేశం పశ్చిమ తీరం వెంబడి ఉన్న గుజరాత్ రాష్ట్రం.. సుమారు 1,600 కిమీ (990 మైళ్ళు) తీరప్రాంతంతో దేశంలోనే అతి పొడవైన రాష్ట్రంగా ఉంది. విస్తీర్ణం ప్రకారం గుజరాత్ ఐదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 60.4 మిలియన్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన 9వ రాష్ట్రంగా ఉంది. ఇది రాజస్థాన్ సరిహద్దులో ఉంది.. ఈశాన్యంలో దాద్రా మరియు నగర్ హవేలీ, దక్షిణాన డామన్ మరియు డయ్యూ , ఆగ్నేయంలో మహారాష్ట్ర, తూర్పున మధ్యప్రదేశ్, పశ్చిమాన అరేబియా సముద్రం, పాకిస్తానీ ప్రావిన్స్ సింధ్ ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో 1 మే 1960న ఆవిర్భవించింది. గుజరాత్ రాజధాని నగరం గాంధీనగర్, అతిపెద్ద నగరం అహ్మదాబాద్. గుజరాత్ రాష్ట్ర అధికార భాష గుజరాతీ. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనభా 60,439,692, రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. కాగా.. గుజరాత్ శాసనసభలో 182 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 92 సీట్లు కావాల్సి ఉంది. గుజరాత్‌లో మొత్తం ఓటర్లు 4,33,14,233 మంది ఉన్నారు. వారిలో పురుషులు 2,25,57,032, మహిళలు 2,07,57,032 మంది ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల అయ్యే అవకాశం ఉంది.
1995 నుంచి బీజేపీ..
గుజరాత్ శాసనసభ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023న ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలను 2017 డిసెంబరులో నిర్వహించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 77 స్థానాల్లో గెలిచారు. బీజేపీ విజయంతో విజయ్ రుపానీ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. 2021 సెప్టెంబర్ 11న విజయ్ రుపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. భూపేంద్ర పటేల్ ఆయన స్థానంలో సీఎం పగ్గాలు చేపట్టారు. దాదాపు 27 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాని మోడీ మూడు సార్లు (2001-2014) సీఎంగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అనంతరం నరేంద్రమోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టారు.
1995 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నింటిలోనూ బీజేపీయే విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 78, బీటీపీ 2, ఎన్సీపీ 1, స్వంతంత్రులు 1 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పడు వరుసగా ఏడోసారి అక్కడ విజయఢంకా మోగించాలని కమలనాధులు పట్టుదలగా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..