Hyderabad: హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా ఎన్నో అద్భుతాలు..
హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త కళను తెస్తూ హెచ్‌ఎండీఏ కోత్వాల్‌గూడ ఎకో పార్క్‌ను రూ.150 కోట్లతో నిర్మించింది. శంషాబాద్ సమీపంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్‌లో 6 ఎకరాల అంతర్జాతీయ పక్షుల కేంద్రం ఉంది. ప్రపంచం నలుమూలల నుండి 10,000 అరుదైన పక్షులు ఇక్కడ ఆకట్టుకోనున్నాయి.

హైదరాబాద్ పర్యాటక రంగానికి మరో బూస్ట్ ఇచ్చే న్యూస్. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అతి దగ్గరలో.. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక అరుదైన పక్షి కేంద్రం రూపం దాల్చింది. రాబోయే రోజుల్లో నగరానికి వచ్చే పర్యాటకులందరికీ ఇది తప్పనిసరి డెస్టినేషన్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. హెచ్‌ఎండీఏ రూపుదిద్దిన ఈ కొత్వాల్‌గూడ ఎకో పార్క్ మొత్తం 85 ఎకరాలు. ఇందులో సరికొత్త ఇంటర్నేషనల్ బర్డ్ సెంటర్ ఒక్కటే 6 ఎకరాలు. అంతేకాకుండా ల్యాండ్‌స్కేపింగ్, బోర్డు వాక్‌లు, రెస్టారెంట్లు, కాటేజీలు, ప్రకృతి అవగాహన కోసం ప్రత్యేక జోన్‌లు ఇలా అనేక ఆకర్షణలను సెట్ చేశారు. మొత్తం ప్రాజెక్టుపై దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు.
ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన, ప్రత్యేక జాతులకు చెందిన 10,000 కంటే ఎక్కువ పక్షులు ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. ఇప్పటికే దాదాపు 1000 రకాల పక్షులను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేసే ప్రక్రియ పూర్తి చేశారు. దీన్ని దఫదఫాలుగా మరింత పెంచుతున్నారు. అమెజాన్ అడవులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా ఖండం ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక పక్షులు ఇప్పుడు హైదరాబాద్‌లోనే అందరి ముందుకు రానున్నాయి. బ్లూ అండ్ గోల్డ్ మేకా, గ్రీన్ వింగ్ మేకా, స్కార్లెట్ మేకా రంగురంగుల మేకా జాతులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రపంచంలో అత్యంత తెలివైన చిలుకల జాతులు కకాటో, అఫ్రికన్ గ్రే ప్యారెట్, అమెజాన్ ప్యారెట్స్ వంటివి ఇక్కడ చూడొచ్చు.
ఫించెస్, లవ్‌బర్డ్స్ వంటి చిన్న, రంగురంగుల పక్షుల గుంపులు.. తమ మృదువైన స్వరాలతో సందర్శకులను పలకరించే కాకటీల్, గ్రౌస్, ప్యారాకిట్స్, క్వేకర్ పారాకీట్స్ వంటివి మన నగరంలో సేద తీరనున్నాయి. రెయిన్‌బో లోరీకీట్‌లు, టౌకాన్‌లు, టుర్కో, మాండరిన్ డక్స్ వంటి వాటిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ పక్షి కేంద్రం కేవలం విజిటింగ్ కోసం మాత్రమే కాదు. బర్డ్ వాచింగ్, నేచర్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలు వంటి వాటికి కూడా ఉపయోగపడనుంది. అన్నిటికీ అనుకూలంగా ప్రత్యేక డిజైన్, సెటప్ చేశారు. పక్షుల సహజ జీవావరణాన్ని ప్రతిబింబించేలా ఎన్విరాన్‌మెంట్‌ను సైతం రూపొందించారు.ఈ ప్రతిష్టాత్మక పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించే అవకాశముంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
