AP Crime News: హుండీ కంటపడిందంటే పగలకొట్టాల్సిందే.. రెచ్చిపోతున్న దొంగలు..
అందరూ దేవుడి దర్శనం కోసం దేవాలయాలకు వెళతారు. వారు మాత్రం హుండిని చూడటానికే గుడికెళతారు. గుంటూరు రూరల్ మండలం
అందరూ దేవుడి దర్శనం కోసం దేవాలయాలకు వెళతారు. వారు మాత్రం హుండిని చూడటానికే గుడికెళతారు. గుంటూరు రూరల్ మండలం తోకవారిపాలెంకు చెందిన తొమ్మిది మంది సభ్యుల ముఠా హుండి దొంగతనాలు చేయడంలో అందె వేసిన చేయి. రామాలయం, శివాలయం, విఘ్నేశ్వరాలయం, సాయి బాబా ఆలయం ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 26 దేవాలయాల్లో హుండీలను పగలకొట్టి డబ్బులు దోచుకున్నారు. వారం రోజుల క్రితం గోరంట్లలోని రామాలయం గ్రూపు దేవాలయాల్లోని మూడు హుండీలను దోచుకున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సిసి కెమెరా విజువల్స్ సేకరించారు. వీరంతా ద్విచక్ర వాహనాలు లేదా ఆటోలో అర్థ రాత్రి సమయంలో ప్రయాణిస్తారు. టార్గెట్ ఆలయంలోకి ముగ్గురు లేదా నలుగురు వెళతారు.
సులభంగా ఉంటే హుండిని పగలకొట్టి నగదు, కానుకలు తీసుకుంటారు. హుండిని పగల గొట్టే అవకాశం లేకపోతే ఏకంగా హుండిని పెకిలించి ఆటోలో వేసుకొని దూర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పగలగొడతారు. ముగ్గురు లేదా నలుగురు ఆలయంలోకి వెళితే మిగిలిన వారు ఆలయం బయట కాపాలా కాస్తారు. చోరి జరిగిన తర్వాత అందరూ కలిసి అక్కడ నుండి ఉడాయిస్తారు. చోరి చేసిన సొత్తును సమానంగా పంచుకుంటారు. ఒకే రోజు ఒకే రూటులో ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తారు. ఒక ఏడాది కాలంలో మొత్తం 26 ఆలయాల్లో చోరి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. సిసి కెమెరా విజువల్స్ ద్వారా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 4600 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
(టి. నాగరాజు, టీవీ9, గుంటూరు)
మరిన్ని ఇక్కడ చదవండి :