AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Mixed Vaccine: కరోనా నియంత్రణకు మిక్సింగ్ టీకాతో రక్షణ.. ఐసీఎంఐర్‌ – ఎన్‌ఐవీ అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు!

రూపం మార్చి బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Covid Mixed Vaccine: కరోనా నియంత్రణకు మిక్సింగ్ టీకాతో రక్షణ.. ఐసీఎంఐర్‌ - ఎన్‌ఐవీ అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు!
Mixing Of Covishield, Covaxin Vaccines
Balaraju Goud
|

Updated on: Aug 09, 2021 | 7:08 PM

Share

Mixing of Covishield, COVAXIN vaccines: రోజుకో రూపం మార్చి బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ మిక్సింగ్‌- మ్యాచింగ్‌ విధానంపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే టీకా మిక్సింగ్‌పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌, నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ చేసిన ఎక్స్‌పరిమెంట్‌ బిగ్‌ రిలీఫ్‌ ఇస్తోంది.

కొవిడ్‌-19 టీకా డోసుల మిశ్రమం బాగానే పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒక డోసు కింద కొవిషీల్డ్‌, మరో డోసు కింద కొవాగ్జిన్‌ టీకాలు పొందిన వారికి.. రెండు డోసులూ ఒకే రకం వ్యాక్సిన్‌ తీసుకున్నవారి కన్నా మెరుగైన రోగ నిరోధక రక్షణ లభిస్తోందని తేలింది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో 98 మందిపై అధ్యయనం జరిపారు. వీరిలో 18 మంది పొరపాటున మిశ్రమ టీకాలను పొందారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల మిశ్రమం సురక్షితమని కూడా గుర్తించారు. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల అదనంగా వస్తున్న దుష్ప్రభావాలేమీ లేవని పేర్కొన్నారు. ఒకే టీకా పొందినప్పుడు వచ్చే సమస్యల స్థాయిలోనే ఇవి ఉంటున్నాయన్నారు.

ముఖ్యంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను వేర్వేరుగా ఒక్కో డోసు తీసుకోవడం సురక్షితమేనని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ పరిశోధనలు తేల్చాయి. ఒకే రకమైన టీకా రెండు డోసులను తీసుకోవడంతో ఏర్పడిన రోగ నిరోధక శక్తితో పొలిస్తే.. రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకోవడంతో యాంటీబాడీలు మరింత ఎక్కువగా పెంపొందుతున్నట్టు గుర్తించింది. పైగా ఆల్ఫా, బీటా, డెల్టా లాంటి వేరియంట్లపై ఈ టీకా మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు తేల్చింది.

యూపీలోని సిద్ధార్ధ్‌నగర్‌లోఓ వ్యాక్సిన్ సెంటర్‌లో 18 మందికి ఫస్ట్ ఫేజ్‌లో కొవిషీల్డ్‌ టీకా వేశారు. ఆ తర్వాత సెకండ్‌ టైమ్‌ పొరపాటున కొవాగ్జిన్ టీకా వేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పొరపాటున రెండు వేర్వేరు డోసులు పొందిన 18 మంది, కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 40 మంది, కొవిషీల్డ్‌ రెండు డోసులు పొందిన 40 మందిపై మే, జూన్‌ నెలల్లో ఇది సాగింది. వారిలో సురక్షిత స్థాయి, రోగనిరోధక రక్షణ వంటి అంశాలను పోల్చి చూశారు. కాగా, ICMR-NIVకి చెందిన నిపుణుల బృందం టీకా తీసుకున్న వాళ్లపై అధ్యయనం చేసింది. పరిశోధనలో వచ్చిన ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. వారిలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ది చెందినట్టు గుర్తించారు.

టీకా మిక్సింగ్‌తో లాభాలు ఉన్నాయన్నది నిపుణుల మాట. ఒక కంపెనీకి చెందిన టీకా అందుబాటులో లేకుంటే రెండో డోసుగా మరో సంస్థ టీకాను వేసుకోవచ్చు. మిశ్రమ డోసులు పొందినవారికి ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్ల నుంచి ఎక్కువ రక్షణ లభిస్తోంది. రెండు డోసుల్లో ఒకే టీకాను పొందిన వారితో పోలిస్తే.. వీరిలో ఐజీజీ యాంటీబాడీ, నిర్వీర్యక యాంటీబాడీ ప్రతిస్పందన అధికంగా ఉంది. . దీంతో వ్యాక్సిన్ ప్రక్రియలో గ్యాప్‌ నివారించవచ్చన్నది నిపుణుల వాదనగా కనిపిస్తోంది. టీకా మిక్సింగ్‌ ఆమోదయోగ్యమే అయినప్పటికీ మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మూడు బృందాల్లోనూ టీకా డోసుల అనంతరం తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తలేదు. ఎక్కువ మందిలో.. ఇంజెక్షన్‌ చేసినచోట నొప్పి మాత్రమే వచ్చింది. కొందరిలో జ్వరం, అలసట లక్షణాలు కనిపించాయి. స్వల్పం నుంచి ఒక మోస్తరు స్థాయిలో జ్వరం వచ్చింది. అది కూడా పారాసిటమాల్‌ ఔషధంతో తగ్గిపోయింది. అధ్యయనంలో పాల్గొన్న మిశ్రమ టీకా బృందం సగటు వయసు 62 ఏళ్లుగా ఉంది. అయినా వారిలో వేర్వేరు వ్యాక్సిన్ల వల్ల ఇబ్బందులు తలెత్తలేదు. ఇలా టీకాలను కలిపేయడం వల్ల.. కొన్ని రకాల వ్యాక్సిన్లకు సంబంధించి ఎదురవుతున్న కొరతను అధిగమించడానికి వీలవుతుంది. రెండు టీకాలు ఇచ్చే కేంద్రాల్లో పొరపాటున ఒకదాని బదులు వేరొకటి ఇస్తారన్న ఆందోళనను ప్రజల మనస్సు నుంచి తొలగించొచ్చు.

ఈ అధ్యయనంపై నిపుణుల సమీక్ష జరగాల్సి ఉంది. మరింత విస్తృత స్థాయిలో పరిశోధించి, ఫలితాలను నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ డోసులను కలిపి ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ గత నెల 30న సిఫార్సు చేసింది. వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) చేసిన దరఖాస్తుపై ఈ మేరకు స్పందించింది. అయితే, వేర్వేరు తయారీదారులు చేసిన కొవిడ్‌ టీకా డోసులను కలపొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథ్‌ గత నెలలో విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఇది చాలా ప్రమాదకర పోకడ అని, దీనిపై చాలా పరిమిత డేటా మాత్రమే అందుబాటులో ఉందని అప్పట్లో పేర్కొన్నారు.

Read Also… Us covid cases: అమెరికాలో డెల్టా విలయ తాండవం..ఆరు మాసాల గరిష్ట స్థాయికి కరోనా కేసులు..

Grand Welcome: టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అంబరాన్నంటిన సంబరాలు