Us covid cases: అమెరికాలో డెల్టా విలయ తాండవం..ఆరు మాసాల గరిష్ట స్థాయికి కరోనా కేసులు..
అమెరికాలో దేశ వ్యాప్తంగా రోజుకు సగటున సుమారు లక్ష కరోనా కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగకపోవడంతో.. ఇవి పెరిగిపోతున్నాయని, ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరాయని వైట్ హౌస్ లో కోవిడ్-19 కో-ఆర్డినేటర్ జెఫ్ జెయింట్స్ మీడియాకు తెలిపారు.
అమెరికాలో దేశ వ్యాప్తంగా రోజుకు సగటున సుమారు లక్ష కరోనా కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగకపోవడంతో.. ఇవి పెరిగిపోతున్నాయని, ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరాయని వైట్ హౌస్ లో కోవిడ్-19 కో-ఆర్డినేటర్ జెఫ్ జెయింట్స్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాలు..ఫ్లోరిడా, టెక్సాస్, మిస్సోరీ, అర్కన్సాస్, లూసియానా, అలబామా, మిసిసిపిలో వ్యాక్సినేషన్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ అధికారులు… ప్రజలను హెచ్చరించేందుకు ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టం ను వినియోగిస్తున్నారు. సుమారు 24 లక్షల జనాభా ఉన్న ఈ సిటీకి ఇప్పుడు ఖాళీగా కేవలం 6 ఐసీయూ బెడ్స్ మాత్రం ఉన్నాయట. దేశంలోని డెల్టా వేరియంట్ కేసులపై అధ్యక్షుడు జోబైడెన్..ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేసుల పెరుగుదలను ట్రాజెడీగా అభివర్ణించారు. కోవిడ్ కారణంగా సోమవారం 400 మంది రోగులు మృతి చెందారని, వ్యాక్సిన్ తీసుకుని ఉంటే ఈ మరణాలను నివారించగలిగి ఉండేవారమని ఆయన అన్నారు. ఏడు రోజుల సగటు కేసులు 95 వేలకు చేరినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ కూడా పేర్కొంది.
ఇది నెలరోజుల లోనే 5 రెట్లు ఎక్కువని వెల్లడించింది. దేశంలోని ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులను చూస్తున్నామని.. వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ఇంకా ఘోరమైన పరిణామాలను చూడవలసి వస్తుందని టెక్సాస్ లోని హారిస్ కంట్రీ జడ్జి లీనా హిడాల్గో ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే రానున్న వారాల్లో రోజుకు కేసులు 2 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటువ్యాధుల నివారణ విభాగం ఉన్నతాధికారి డాక్టర్ ఆంథోనీ ఫోసి హెచ్చరించారు. ఫ్లోరిడాలో గత గురువారం ఒక్కరోజే సుమారు పన్నెండున్నర వేలమంది రోగులు ఆసుపత్రి పాలయ్యారన్నారు. అటు-లూసియానా, అర్కన్సాస్ రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు సంచలన వ్యాఖ్య.. సంచలనం రేపుతున్న ట్వీట్: Nagababu on President Post Live Video.