Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఇకపై విదేశీ జాతీయులకు టీకాలు

భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, వారు కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదును స్వీకరించడానికి అనుమతించింది.

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఇకపై విదేశీ జాతీయులకు టీకాలు
Covid 19 Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 09, 2021 | 10:16 PM

Corona Vaccine for Foreign Nationals: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. వైరస్ కట్టడిలో భాగంగా వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అన్న నిపుణుల సూచనలతో విశ్వ వ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, వారు కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదును స్వీకరించడానికి అనుమతించింది.

దేశంలో ఉంటున్న విదేశీ జాతీయులు ఇకపై కరోనా వ్యాక్సిన్‌ పొందవచ్చు. కరోనా టీకాకు పొందేందుకు అర్హులుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని మిగతా లబ్ధిదారుల మాదిరిగా విదేశీయులు కూడా కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది. గుర్తింపు పొందిన ధ్రువీకరణగా వారి పాస్‌పోర్ట్‌ను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.

వివిధ దేశాలకు చెందిన విదేశీ జాతీయులు భారతదేశంలో.. ముఖ్యంగా పెద్ద మహానగరాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో, అధిక జనాభా సాంద్రత కారణంగా కోవిడ్ -19 వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ టీకాలు వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘మనం కలిసి పోరాడదాం, కరోనాపై కలిసి గెలుద్దాం. దీని కోసం చేతులు కలుపుదాం. ఇప్పుడు భారత్‌లో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది వైరస్ వ్యాప్తి నుంచి భద్రతను నిర్ధారిస్తుంది’ అని ట్వీట్ చేసింది.

మరోవైపు దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కాగా, ప్రస్తుతం దేశంలోని 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ అందిస్తున్నారు. ఆగష్టు 9, 2021 నాటికి, భారతదేశం దేశవ్యాప్తంగా 51 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను పొందారు. ఇదిలావుంటే, భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కోవిన్ టీకా తీసుకోవడానికి కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం వారు తమ పాస్‌పోర్ట్‌ను ID గా ఉపయోగించవచ్చు. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత, వారికి టీకా కోసం స్లాట్ లభించనుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల మాట్లాడుతూ, COVID-19 కి వ్యతిరేకంగా టీకాలు వేసిన సిటిజన్లు ఇప్పుడు సెకన్లలో WhatsApp ద్వారా వారి టీకా సర్టిఫికేట్ పొందవచ్చు.

ప్రస్తుతం, కోవిన్ పోర్టల్‌లోకి లాగిన్ కావడం ద్వారా ప్రజలు తమ టీకా సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. “టెక్నాలజీని ఉపయోగించి సామాన్యుడి జీవితంలో విప్లవాత్మక మార్పులు! ఇప్పుడు 3 సులభ దశల్లో MyGov కరోనా హెల్ప్‌డెస్క్ ద్వారా COVID-19 టీకా సర్టిఫికెట్ పొందండి. సంప్రదింపు నంబర్‌ను సేవ్ చేయండి: +91 9013151515. WhatsApp లో ‘కోవిడ్ సర్టిఫికేట్’ అని టైప్ చేసి పంపండి. OTP ని నమోదు చేయండి. మీ సర్టిఫికెట్‌ను క్షణాల్లో పొందవచ్చని” మాండవీయ కార్యాలయం ట్వీట్ చేసింది.

Read Also…  Olympic winners: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులకు దేశం జైజేలు.. పతక విజేతలకు కేంద్రం ఘన సన్మానం..చిత్రాలు