UGC NET 2025 Exam Dates: యూజీసీ నెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
UGC-NET December 2025 examination Subject-wise Schedule: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025 (యూజీసీ- నెట్)కు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పరీక్షల తేదీలను..

హైదరాబాద్, డిసెంబర్ 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025 (యూజీసీ- నెట్)కు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పరీక్షల తేదీలను ఎన్టీయే ప్రకటించినప్పటికీ.. తాజాగా సబ్జెక్టుల ప్రకారం పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఎన్టీయే తాజా షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, షిఫ్ట్ 2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగన్నాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేస్తారు. ఆ తర్వాత అడ్మిట్ కార్డులను పరీక్షకు సరిగ్గా 4 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్ధులు తమ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీఏ సూచించింది. కాగా యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డుతోపాటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
యూజీసీ నెట్ 2025 డిసెంబర్ పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








