TS TET 2024 Exam Date: తెలంగాణ టెట్ పరీక్షపై వీడని సందిగ్ధత.. విద్యాశాఖకు ఈసీ లేఖ
TS TET 2024 likely to be postponed: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్ష తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా టెట్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్రాజ్ ఈ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశానికి..

హైదరాబాద్, మే 3: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్ష తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా టెట్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్రాజ్ ఈ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశానికి సూచించారు.
తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం టెట్ 2024 పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రకటనల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్సీ ఎన్నిక మే 27వ తేదీన జరపాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. సరిగ్గా ఇదే సమయంలో అటు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు కూడా జరుగుతాయి. దీంతో పరీక్షల వల్ల తాము ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఓ ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఈసీ వికాస్రాజ్ స్పందించారు. తాజా అభ్యర్ధనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అనంతరం ఆ సమాచారాన్ని తనకు, అర్జీదారుకు పంపించాలని విద్యాశాఖ సెక్రటరీకి ఆయన లేఖ రాశారు. ఇప్పటి వరకూ టెట్ ఫరీక్ష వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షలను ఎన్నికల అనంతరం నిర్వహించేలా రీషెడ్యూల్ చేశాయి. అయితే ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఎలాంటి అవాంతరాలు ఉండవని తొలుత భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీనిపై విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








