AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ..అసలు కారణం ఇదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌ 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఐతే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మాత్రం కోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్టీ రిజర్వేషన్‌ అమలుపై పూర్తి వివరాలతో..

TSPSC Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ..అసలు కారణం ఇదే..
Telangana High Court
Srilakshmi C
|

Updated on: Oct 14, 2022 | 3:15 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌ 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఐతే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మాత్రం కోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్టీ రిజర్వేషన్‌ అమలుపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసింది. కాగా ఎస్టీ రిజర్వేషన్‌లను పెంచుతూ రాష్ట్ర సర్కార్‌ జారీచేసిన జీవో అమలుపై హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. దానిని విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

గ్రూప్‌-1 కింద 503 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పరీక్షకు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌ 1 హాల్‌టికెట్లను రెండున్నర లక్షల మంది ఇప్పటివరకు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఐతే ఇటీవల ఎస్టీ రిజర్వేషన్‌లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో 33 జారీ చేసింది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 పరీక్షలకు సైతం అమలు చేయాలని కోరుతూ మెదక్‌ జిల్లాకు చెందిన ఐదుగురు పిటిషనర్లు హైకోర్టులో ఈ నెల 13న‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్టీలకు ఇప్పటికే ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే కేవలం 31 మంది మాత్రమే లబ్ధి పొందుతారని, 10 శాతం అమలుచేస్తే 50 మందికి లబ్ధి చేకూరుతుందని పిటిషన్ల తరపున న్యాయవాది తన వాదనలను వినిపించారు.

ఇవి కూడా చదవండి

రిజర్వేషన్‌ల పెంపునకు సంబంధించిన జీవో సెప్టెంబరులో జారీ అయిందని, పెంపుదల తర్వాత విడుదలయ్యే నోటిఫికేషన్లకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని, ఏప్రిలోలో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు ఎలా అమలు చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది ఎ సంజీవ్‌కుమార్‌ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పరీక్షకు ఇంకా రెండు రోజుల వ్యవధి మత్రమే ఉందని, ఈ క్రమంలో పరీక్షను నిలిపివేస్తే ఐదు లక్షల మంది ప్రభావితమవుతారని, అందువల్లనే పరీక్షలను నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వలేమని అన్నారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్‌ ఎన్‌వి శ్రావణ్‌కుమార్‌ విచారణను వాయిదా వేశారు.