Engineering Admissions 2025: రేపట్నుంచే రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. భారీగా కన్వినర్ కోటా సీట్లు!
రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో మొత్తం 83,054 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా.. ఇందులో తొలి విడతలో 77,561 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో 59,980 మంది మాత్రమే ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేశారు. మిగిలిన 17,581 మందికి అంటే 22.66 శాతం మందికి తాము ఎంచుకున్న..

హైదరాబాద్, జులై 24: ఈఏపీసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తైంది. కన్వీనర్ కోటాలో మొత్తం 83,054 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా.. ఇందులో తొలి విడతలో 77,561 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో 59,980 మంది మాత్రమే ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేశారు. మిగిలిన 17,581 మందికి అంటే 22.66 శాతం మందికి తాము ఎంచుకున్న బీటెక్ బ్రాంచీలు నచ్చలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు జులై 22న ముగిసింది. గడువు సమయం నాటికి ఇందులో 59,980 మంది మాత్రమే అంటే 77.34 శాతం మంది ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేశారు.
కొందరు జోసా కౌన్సెలింగ్‌లో సీటు కోసం వేచి చూస్తున్నవారు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కచ్చితంగా సీట్లు వస్తాయని ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లోనే పాల్గొనలేదు. జోసా కౌన్సెలింగ్ ద్వారా సీటు వస్తుందో? రాదో? అన్న సందేహం ఉన్నవారు మాత్రం ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయితే వారికి తొలి విడతలో సీట్లు కేటాయించినప్పటికీ చేరేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. ఇక మరికొందరేమో యాజమాన్య కోటాలో సీట్లు పొందేందుకు ముందుగానే నిర్ణయించుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీటు రాదనుకుఉన్నవారు బీఎస్‌సీలో చేరేందుకు మొగ్గు చూపి ఉండొచ్చని భావిస్తున్నారు.
రేపటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం…
ఇక జులై 25, 2025వ తేదీ నుంచి రెండో విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వీరికి జులై 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు, జులై 30వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇదిలాఉంటే.. రెండో విడతకు బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. తొలి విడతలో మిగిలిపోయిన సీట్లు ఇందులో కలవనున్నాయి. తొలి విడతలో మొత్తం 23,074 సీట్లు మిగిలాయి. మరికొన్ని కాలేజీల్లో కోర్ బ్రాంచీలైన ఈసీఈ, సివిల్, మెకానికల్ గ్రూపు సీట్లకు అనుమతికి దాదాపు లైన్ క్లియర్ అయింది. వీటిల్లో దాదాపు 5 వేల వరకు సీట్లు రావచ్చు. సీట్లు పెరగడం వల్ల రెండో విడతలో పోటీపడే విద్యార్థులు విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




