JEE Main 2026: జేఈఈ మెయిన్‌లో టాప్ స్కోర్ కొట్టాలంటే.. మీ రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి!
JEE Main 2026 Revision Strategy: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 తొలివిడత ఆన్‌లైన్ పరీక్షల తేదీలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తి స్పష్టత వచ్చింది. గత నవంబరులో నోటిఫికేషన్ సమయంలో జనవరి 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ తెల్పింది. అయితే గురువారం (జనవరి 8) విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ ప్రకటనలో పరీక్షల తేదీలపై స్పష్టత వచ్చింది..

హైదరాబాద్, జనవరి 9: జేఈఈ మెయిన్ 2026 పేపర్ 1, పేపర్ 2 తేదీలను NTA ప్రకటించింది. ఈ ప్రకటన మేరకు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో బీటెక్ సీట్లలో ప్రవేశాలకు నిర్వహించే పేపర్ 1 ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి. ఇక జనవరి 29వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఈ అన్ని పరీక్షలు ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారంగా జరగనున్నాయి. పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం షిఫ్ట్‌లో ఒకసారే జరుగుతుంది. జేఈఈ మెయిన్ సిటీ ఇన్‌ఫర్మేసన్ స్లిప్‌లను అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఎక్కడెక్కడ తమకు పరీక్ష నగరం కేటాయించారో తెలుసుకోచ్చు. ఇక పరీక్షకు నాలుగు రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు ఎన్టీయే స్పష్టం చేసింది.
ఇక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్ధులు కూడా పోటాపోటీగా ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. ఈ క్రమంలో నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అనుసరించాల్సిన ప్రిపరేషన్ టిప్స్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
ఇప్పుడున్న తక్కువ సమయాన్ని రోజువారీ లేదా వీక్లీ టార్గెట్లుగా విభజించుకోవాలి. రోజుకు రెండు చాప్టర్లు రివిజన్ చేయాలి. లేదంటే ఇన్ని ప్రాబ్లెమ్స్ పరిష్కరించాలి అని మైక్రో గోల్స్ పెట్టుకోవడం వల్ల కాన్సెప్టులపై పట్టు దొరుకుతుంది.
వేగంతో పాటు ఖచ్చితత్వం
జేఈఈ మెయిన్స్ 2026లో ఇచ్చిన సమయంలో వేగంగా సమాధానాలు గుర్తించాలంటే వేగంతో పాటు ఖచ్చితత్వం చాలా అవసరం. వేగం పెంచాలనే ఆరాటంలో తప్పులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. మొదట బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం పెట్టాలి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా ముందుకు వెళ్లడం తెలివైన పని.
కొత్తవి వద్దు.. పాతవే రివిజన్
జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున కొత్త చాప్టర్లను మొదలుపెడితే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఇప్పటి వరకు నేర్చుకున్నవే రివిజన్ చేయండి. లోతైన అవగాహనతో చదవడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది.
మాక్ టెస్టులు రాయండి
మాక్ టెస్టులు రాసేటప్పుడు తరచూ చేస్తున్న తప్పులను గమనించి విశ్లేషించుకోవాలి. బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్ల పరీక్ష రోజున అవే తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడొచ్చు.
కాన్సెప్ట్‌లపై పట్టు
జేఈఈ లాంటి కఠినమైన పరీక్షలకు బట్టి పట్టి పాస్ అయిపోవాలను కోవడం మూర్ఖత్వం. ఈ పరీక్ష పూర్తిగా మీ తెలివి తేటలకు సంబంధించింది. ఫిజిక్స్‌లో డెరివేషన్లు, కెమిస్ట్రీలో లాజిక్స్ వంటి బేసిక్ కాన్సెప్ట్స్ క్షుణ్ణంగా నేర్చుకుంటే పునాది బలంగా ఉంటుంది.
టైం మేనేజ్‌మెంట్
పరీక్ష హాల్‌లో టైమ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. అందువల్ల తొలుత మీకు బాగా తెలిసిన ప్రశ్నలన్నీ చకచకా పూర్తి చేయండి. ఆ తర్వాత మిగిలిన సమయాన్ని కష్టమైన ప్రశ్నలకు కేటాయించాలి. ఒకే ప్రశ్న దగ్గరే ఆగిపోయి ఎక్కువ సమయం వృధా చేయడం చాలా డేంజర్.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




