TG EAPCET 2025: ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్.. ఇక ఎవరికివారే యమునాతీరే!
తెలంగాణ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు శనివారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రతీయేట ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలను కేటాయించే జేఎన్టీయే ఈ సారి మాత్రం ఏపీలో పరీక్ష సెంటర్లను అధికారులు తొలగించారు. ఈఏపీసెట్‌లో ఏపీ కోటా సీట్లను నిలిపివేసిన నేపథ్యంలో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు..

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈఏపీసెట్‌కు సంబంధించి కన్వీనర్ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వుచేస్తూ జీవో జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ఈ పరీక్ష సెంటర్లను కూడా రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU).. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలను తొలగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. తొలుత ఏపీలోని విజయవాడ, కర్నూలు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఏపీ విద్యార్థులు పోటీపడేందుకున్న 15 శాతం స్థానికేతర సీట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తర్వాత.. పరీక్ష కేంద్రాల రద్దు నిర్ణయం తీసుకుంది.
ప్రతీయేట తెలంగాణ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దాదాపు 55 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చేవి. ఏపీ నుంచి 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చేవి. అధిక మొత్తంలో ఏపీ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు వస్తున్నందున కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో కేంద్రాలతో పరీక్షను నిర్వహిస్తూ వచ్చింది.
ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొత్తం 5,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 3,116 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 1891 మంది, రెండు పరీక్షలకు హాజరయ్యేందుకు ముగ్గురు చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణలకు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు అవకాశం ఇస్తారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9వరకు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక వ్యవసాయ, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29, 30 తేదీలలో జరుగుతుంది, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకు ఉంటుంది. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




