Watch Video: ఆస్తి కోసం దారుణం.. కన్నతల్లిని బంధించి చిత్రహింసలు పెట్టిన కుమార్తె! వీడియో
ఓ కూతురు ఆస్తి కోసం తల్లికి ఆహారం ఇవ్వకుండా, గదిలో బంధించి కొట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఆస్తి రాసివ్వకుంటే కొరిగి రక్తం తాగుతానని బెదిరించింది. భర్తతో కలిసి నిత్యం తల్లిని ఇలా హింసిస్తున్న ఆమె బండారాన్ని సోదరుడు బట్టబయలు చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని హిసార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో..

హర్యానా, మార్చి 2: కనిపెంచిన పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటారని, వారిని కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకుంటారు. కానీ పిల్లలను కనగలరుగానీ.. వారి రాతలను కనలేరని పెద్దలు అంటారు. నేటి కాలంలో అదే జరుగుతుంది. రాలడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులను కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు కన్నబిడ్డలు. తాజాగా ఓ కూతురు ఆస్తి కోసం తల్లికి ఆహారం ఇవ్వకుండా, గదిలో బంధించి కొట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఆస్తి రాసివ్వకుంటే కంఠం కొరిగి రక్తం తాగుతానని బెదిరించింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని హిసార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హర్యానాలోని హిసార్‌లోని ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో నివాసం ఉంటున్న రీటా అనే మహిళ ఆస్తి కోసం తన తల్లి నిర్మలా దేవిపై దాడి చేసింది. వృద్ధురాలైన తల్లిపై దాడి చేయడం, దుర్భాషలాడడం, కొరికేయడం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో మంచంపై కూర్చున్న తల్లిని రీటా చెంపలపై కొట్టి, కాళ్లు పట్టుకుని కొరికి ఇష్టం వచ్చినట్లు కొట్టడం, దుర్భాషలాడటం కనిపిస్తుంది. కూతురి చేష్టలకు తల్లి నిర్మలా దేవి ఏడుస్తూ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ‘ఆస్తి రాసివ్వకుంటే నా చేతిలో చస్తావ్.. కొరికి నీ రక్తం తాగుతా’ అని తల్లిని బెదిరించడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో వృద్ధురాలి కుమారుడు అమర్ దీప్ సోదరి రీటాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
A Daughter torturing her Mother.
I’m shock that – it’s her own mother, NOT mother-in-law.@police_haryana@DGPHaryanapic.twitter.com/Npv8dMka2X
— ShoneeKapoor (@ShoneeKapoor) February 27, 2025
సోదరి రీటాకు సంజయ్ పునియా అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం తర్వాత అత్తింటి నుంచి కొన్ని రోజులకే తిరిగొచ్చిన రీటా.. భర్తతోపాటు హిసార్‌లోని ఆజాద్ నగర్‌లో తల్లి వద్ద నివసిస్తున్నారు. రీటా భర్త నిరుద్యోగి. అయితే ఆస్తి కోసం సోదరి రీటా.. తల్లిని మానసికంగా, శారీరకంగా వేధిస్తుందని, కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా బంధించి వేధిస్తున్నారనీ ఆమె సోదరుడు అమర్ దీప్ ఆరోపించాడు. అంతేకాకుండా కురుక్షేత్రలోని తన కుటుంబ ఆస్తిని రూ.65 లక్షలకు అమ్మగా ఆ డబ్బు మొత్తం రీటా తీసుకుందని, ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని కూడా తన పేరు మీదకు మార్చుకోవాలని రీటా ప్రయత్నిస్తుందని సోదరుడు ఆరోపించాడు. రీటా తనను ఇంటికి రాకుండా అడ్డుకుందని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ సాధురామ్ మాట్లాడుతూ.. నిందితులురాలు రీటాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




