NEET UG 2024 Controversy: గతంలో నీట్ ఫస్ట్ ర్యాంక్.. రీ-టెస్టులో అత్తెసురు మార్కులు! లీకులు నిజమేనన్నమాట..
నీట్ యూజీ 2024 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల రీటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు కూడా వెనువెంటనే వెలువరించారు. మొత్తం 1563 మందికి రీటెస్ట్ నిర్వహించవల్సి ఉండగా.. పరీక్షకు మాత్రం కేవలం 813 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 750 మంది పరీక్షకు డుమ్మా..
న్యూఢిల్లీ, జులై 21: నీట్ యూజీ 2024 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల రీటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు కూడా వెనువెంటనే వెలువరించారు. మొత్తం 1563 మందికి రీటెస్ట్ నిర్వహించవల్సి ఉండగా.. పరీక్షకు మాత్రం కేవలం 813 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 750 మంది పరీక్షకు డుమ్మా కొట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే ఫలితాల్లో అభ్యర్ధులు సాధించిన మార్కులు చర్చణీయాంశంగా మారాయి. సుప్రీం విచారణలో భాగంగా నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం (జులై 20) వెల్లడించింది. దీని ప్రకారంగా.. జూన్ 4న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందులో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు అభ్యర్ధులకు ఏకంగా 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదంతా 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం వల్లనే వచ్చిందని గుర్తించిన సుప్రీం కోర్టు, వారికి రీ టెస్ట్ నిర్వహించాలని ఎన్టీయేని ఆదేశించింది.
శనివారం విడుదలైన మార్కుల జాబితాలో సదరు కేంద్రంలో వచ్చిన అత్యధిక స్కోరు 682గా ఉండటం విచిత్రం. అది కూడా కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే వచ్చాయి. ఇక 13 మంది విద్యార్థులకు 600 పైగా మార్కులు వచ్చాయి. దీంతో నీట్ యూజీ పరీక్షలో తొలుత వెల్లడైన ఫలితాలకు, తాజా రీటెస్ట్ మార్కులకు భారీ వ్యత్యాసం కనిపించింది. అంతేకాకుండా రీటెస్ట్ ఫలితాల వెల్లడి సమయంలో నీట్ యూజీ పరీక్ష రాసిన అందరికి సవరించిన ర్యాంకులు ఇచ్చింది. దీంతో విద్యార్ధుల ర్యాంకుల్లో భారీగా పురోగతి కనిపించింది.
మరోవైపు నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేస్తుంది. విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన అభ్యర్ధులకు మార్కుఉలు ఎక్కువ వచ్చాయా.. లేదా? అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు తెలియజేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఎన్టీఏను ఆదేశించింది. మార్కులను మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు ఎన్టీయే తాజాగా మార్కుల వివరాలు వెల్లడించగా.. సంబంధిత పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధులు మార్కుల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. దీనిని బట్టి చూస్తే పేపర్ లీక్ ఆరోపణలు నిజమేనని స్పష్టం అవుతుంది. దీనిపై తుదుపరి చర్యలు ఏవిధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.