Spice Prices: ఏం కొనేటట్టులేదు..ఏం తినేటట్టులేదు..! మండిపోతున్న మసాలా ధరలు..
ఏది ఏమైనా ధరలు చూస్తుంటే రుచికరమైన కూరలు తినడం ఇక కుదరదేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎప్పుడో కొండెక్కి కూర్చున్నాయి. బియ్యం, పప్పు, ఉప్పు వంటి వస్తువులు కొనక తప్పని పరిస్థితి.

బిర్యానీ, కూరలు ముఖ్యంగా నాన్‌వెజ్ కర్రీలకు మసాలాలు తోడైతేనే రుచి. కాని ఇప్పుడు మసాలాలు కొనే పరిస్థితే లేదు. మసాలాల ధరలు చూసిన తర్వాత బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్‌కు నో చెప్పాల్సిన రోజులు వచ్చేశాయి. అల్లం, వెల్లుల్లి, ఎండు మిర్చి, జీలకర్ర, లవంగాలు, ఇలాచీల వంటి సాధారణ మసాల దినుసుల ధరలన్నీ ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. నెల క్రితం వరకు 40 రూపాయలున్న అల్లం వెల్లుల్లి ధరలు మూడు రెట్లు పెరిగాయి. మంచి రకం అల్లం ధర ఇప్పుడు కేజీకి 120 రూపాయలు పలుకుతోంది. పచ్చళ్ల సీజన్ వస్తుండటంతో ఏం చేయాలో చాలా కుటుంబాలకు పాలుపోవడం లేదు. ఎండు మిర్చి కేజీ ధర సంవత్సరం క్రితం 160 రూపాయలుంటే ఇప్పుడు 500 రూపాయలు పలుకుతోంది. మిర్చి తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరగడం ఖాయంగా తెలుస్తోంది.
జీలకర్ర లేకుండానే కూరలు వండుకోవాల్సి వస్తోంది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్ మార్కెట్‌లో మూడు నాలుగొందల రూపాయలు కేజీ పలికిన జీలకర్ర ధర ఇప్పుడు 900లకు చేరింది. ప్రపంచ జీలకర్రలో 70 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. అకాల వర్షాల కారణంగా జీలకర్ర దిగుబడి బాగా తగ్గిపోయింది. వంటకు ఉపయోగించే మసాలా దినుసుల్లో అతి ఎక్కువగా ఉపయోగించే రెండో పదార్థం జీలకర్ర. ఇక కూరల్లో తాలింపు కోసం వేసే ఇంగువ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. అంతగా పెరిగిపోయింది ఇంగువ ధర. ఏడాది క్రితం 10 వేల రూపాయలు కిలోగా ఉన్న ఇంగువ ఇప్పుడు 30 వేలు పలుకుతోంది.
ధనియాలు, వాము ధరలు కూడా కొండెక్కెశాయి. ఇక లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యం కోసం చాలా మంది డ్రైఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. కాని ఇప్పుడు రెండు పిస్తా పలుకులు నోట్లో వేసుకుందామంటే కుదరని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు 1200 రూపాయలున్న పిస్తా ధర ఇప్పుడు 1800 రూపాయలు దాటిపోయింది. బాదాం, కిస్‌మిస్ ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. వాస్తవానికి గతంలో మసాలా దినుసులు స్పెషల్ వంటకాల్లోనే జనాలు ఎక్కువగా ఉపయోగించేవారు. కాని, లాక్‌డౌన్ సమయంలో వీటి వినియోగం పెరిగింది. కషాయాలు చేసుకోవడం, పాలల్లో కలుపుకొని తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. వీటి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు కూడా సూచించడంతో చాలా మంది సరుకుల లిస్టులో మసాలా దినుసులన్నీ చేరాయి.




ధరలు పైకి ఎగబాకుతున్న తీరు చూస్తుంటే కూరల్లో మసాలలు వేసుకోవడం ఇక కష్టమే అనిపిస్తుంది. ఏది ఏమైనా ధరలు చూస్తుంటే రుచికరమైన కూరలు తినడం ఇక కుదరదేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎప్పుడో కొండెక్కి కూర్చున్నాయి. బియ్యం, పప్పు, ఉప్పు వంటి వస్తువులు కొనక తప్పని పరిస్థితి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..




