Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లలో ఈ తేడాల గురించి తెలుసా..? ఇలా చేస్తే మీ డబ్బు సేవ్..
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అన్నీ విషయాలు సరిగ్గా చూసుకోవాలి. దాని వల్ల డబ్బు ఆదా అవుతుంది. హోమ్ లోన్ వడ్డీ రేట్లలో వివిధ రకాలు ఉంటాయి. మీకు ఏది సెట్ అయితదో దాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి.. ఈ నగరంలో నాకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండును. నగరాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇలాగే ఆలోచిస్తారు. నేటి కాలంలో ఇల్లు కొనడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంతో చాలా మంది లోన్ తీసుకుని ఇల్లు తీసుకుంటున్నారు. హోమ్ లోన్స్ ఎంతో మంది ప్రజల కలను నెరవేరుస్తున్నాయి. అయితే లోన్ తీసుకునేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేకపోతే నష్టపోతాం. ముఖ్యంగా వడ్డీ రేట్లు. హోమ్ లోన్ విషయంలో ఏ వడ్డీ రేటును ఎంచుకోవాలో ముఖ్యం. ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్, హైబ్రిడ్ వంటి రకాలు ఉంటాయి. వీటిలో మీకు ఏది బెటర్ ఉంటదో చూసుకోవాలి.
ఫిక్స్‌డ్ వడ్డీ రేటు
ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో మీ హోమ్ లోన్ వడ్డీ రేటు లోన్ పూర్తయ్యే వరకు స్థిరంగా ఉంటుంది. అంటే మీరు రుణం తీసుకున్నప్పటి నుంచి చివరి వాయిదా వరకు వడ్డీ రేటులో ఎటువంటి మార్పు ఉండదు. దీని వల్ల మీ ఈఎంఐ మొత్తం స్థిరంగా ఉంటుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినా, మీ ఈఎంఐ పెరగదు. ఆర్థికంగా స్థిరత్వం కోరుకునే వారికి, స్థిరమైన బడ్జెట్ ఉన్న వారికి ఇది సరైన ఎంపిక. అయితే మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. మీ ఈఎంఐ తగ్గకపోవడం అనేది ఒక్కటే సమస్య.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు
ఫ్లోటింగ్ వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, ఇతర ఆర్థిక విధానాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఇది చాలా వరకు మార్కెట్ ఆధారిత ఎంపిక. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, మీ ఈఎంఐ మొత్తం కూడా తగ్గుతుంది. ఇది దీర్ఘకాలిక రుణాలకు ఎక్కువ ఆదా చేసే అవకాశం కల్పిస్తుంది. ఇదే సమయంలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, మీ ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులను భరించగలిగేవారికి ఈ ఎంపిక అనుకూలంగా ఉంటుంది.
హైబ్రిడ్ వడ్డీ రేటు
హైబ్రిడ్ వడ్డీ రేటు అనేది స్థిర, ఫ్లోటింగ్ రేట్ల కలయిక. ఈ పద్ధతిలో లోన్ మొదట్లో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత అది ఫ్లోటింగ్ రేటుగా మారుతుంది. ప్రారంభంలో మీ ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఇది ఆర్థిక ప్రణాళికలో స్థిరత్వాన్ని అందిస్తుంది. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేటు మారుతుంది. తద్వారా వడ్డీ రేటు తగ్గినప్పుడు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొదట్లో స్థిరమైన ఈఎంఐని కోరుకునే వారికి, భవిష్యత్తులో మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
ఏది ఎక్కువ ఆదా ?
ఫిక్స్‌డ్: సురక్షితమైన మార్గాన్ని ఇష్టపడేవారికి ఇది అనువైనది. వడ్డీ రేట్ల పెరుగుదల నుండి రక్షణ కల్పిస్తుంది.
ఫ్లోటింగ్ రేటు: మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆదా చేస్తుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయని మీరు భావిస్తే ఇది మంచి ఎంపిక.
హైబ్రిడ్ రేటు: ఈ రెండింటి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.
మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు, మీ ఆర్థిక పరిస్థితి, నెలవారీ బడ్జెట్, మార్కెట్ ట్రెండ్‌లను జాగ్రత్తగా పరిశీలించి సరైన ఎంపికను చేసుకోవడం తెలివైన పని.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




