విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం మొదలవబోతుంది. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ మొదట్నుంచి అవలంభిస్తున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలెట్టింది. ఈనెల ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు మచిలీపట్నంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు 18 మంది దరఖాస్తులు చేసుకోగా, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 98 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
దరఖాస్తుల ద్వారా పార్టీకి రూ.2.86 లక్షల నిధి సమకూరింది. రాష్ట్ర విభజనతో 2014లో చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతైన కాంగ్రెస్ కు ఈ రేంజ్ లో దరఖాస్తులు రావడంపై అగ్రనేతలు ఆనందంతో ఉన్నారు. గతంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించిన సుంకర పద్మశ్రీ విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేయాలనుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్‌ను పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు గురునాథం ఆశిస్తున్నారు. పార్టీ జిల్లా ఇంచ్ఛార్జ్ ధనేకుల మురళి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
దరాఖాస్తులన్నింటిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు కొన్ని పేర్లను పీసీసీకి పంపుతారు. అక్కడ పరిశీలన కమిటీ అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఏఐసీసీ కమిటీకి పంపుతుంది. అక్కడ ఫైనల్ జాబితా ఖరారవుతుంది. మరి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎవరికి హస్తం అభయం ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.