Shukra Gochar 2025: వృషభ రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి విలాస జీవితం!
Shukra Gochar 2025: జూన్ 26 నుండి నెల రోజుల పాటు శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక రాశుల వారు గణనీయమైన మార్పులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి, సంబంధాలు, ఉద్యోగం, వ్యాపారం, దాంపత్య జీవితంలో మెరుగైన మార్పులు లేదా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే ఈ కాలంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Shukra Gochar 2025
ఈ నెల(జూన్) 26వ తేదీ నుంచి నెల రోజుల పాటు తన స్వస్థానమైన వృషభ రాశిలో శుక్ర గ్రహం సంచారం చేయడం జరుగుతోంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుక్రుడికి బలం పట్టినా, శుక్రుడు తన ఉచ్ఛ, స్వక్షేత్రాలలో సంచారం చేస్తున్నా కొన్ని రాశుల వారి జీవితాలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. విలాస జీవితం అలవడుతుంది. వ్యసనాలు, అనవసర పరిచయాలు కలుగుతాయి. తేలికగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి. శుక్రుడి వృషభ రాశి సంచారం వల్ల ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక రాశుల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ధనానికి లోటుండని పరిస్థితి నెలకొంటుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. భోగభాగ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత హ్యాపీగా సాగిపోతుంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. వేషభాషల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా ఉన్నత స్థాయి వారితో, సంపన్నులతో స్నేహాలు చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థాయి వెళ్లే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శృంగార జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. భోగ భాగ్యాలు వృద్ధి చెందుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఇతర జెండర్లతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎక్కువగా విందులు, వినోదాల్లో మునిగి తేలే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి దశమంలో శుక్ర సంచారం వల్ల కొత్తవారితో సన్నిహిత సంబంధాలతో పాటు, అనవసర పరిచయాలు కూడా ఏర్పడతాయి. విలాస జీవితం ఏర్పడుతుంది. విందులు, వినోదాలు, విహార యాత్రల మీద ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ విభేదాలు, అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత, సామరస్యం వృద్ది చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంది. ఉన్నత స్థాయి పరిచయాలు పెరుగుతాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి తేలికగా ఆదాయం సంపాదించడానికి అవకాశాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం వల్ల సంపదకు, భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమంలో శుక్రుడి సంచారం వల్ల కోరికలు పెరుగుతాయి. అనవసర పరిచయాలు పెరుగుతాయి. విలాస జీవితానికి అలవాటుపడడం జరుగుతుంది. విందు వినోదాల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో ఈ రాశివారికి ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. శృంగార జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది.



