Career Astrology: గురు, రవుల యుతి.. ఈ రాశుల వారికి అరుదైన అధికార యోగం..!
Sun Guru Conjunction: జూన్ నెల 14వ తేదీన రవి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే గురువు మిథున రాశిలో ఉన్నందున.. రవి అక్కడ గురువుతో యుతి చెందనున్నాడు. దీని ప్రభావంతో వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులవారికి ఉద్యోగంలో పదోన్నతులు, జీతం పెరుగుదల, ఆర్థిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది.

Career Astrology
ఈ నెల(జూన్) 14న రవి గ్రహం తనకు మిత్ర క్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడే నెల రోజుల పాటు ఉంటుంది. ఇప్పటికే మిథున రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహంతో కలవడం వల్ల కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు, రవులు మిత్రులు. ఈ రెండు గ్రహాల యుతి వల్ల వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతభత్యాలు పెరగడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, యాక్టివిటీ పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రవి, గురువులు కలవడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది.
- సింహం: రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ధన కారకుడు గురువుతో కలవడం విశేషమైన ధనయోగాలనిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు, రవులు కలవడం అత్యంత శుభప్రదం. ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అన్ని విధాలా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నతాధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం, విదేశీ సంపాదన అనుభవించడం జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- తుల: ఈ రాశికి భాగ్యస్థానంలో గురు, రవులు కలవడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- ధనుస్సు: సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువును భాగ్యాధిపతి రవి కలవడం వల్ల ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- మీనం: రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో రవితో కలవడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. వాహన యోగం కూడా కలుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం ఫలితాలనిస్తుంది. తల్లి వైపునుంచి ఆస్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.