Rohit Virat : విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత? ఐపీఎల్ లో కోట్లు..ఇక్కడ మాత్రం ఇంతేనా
Rohit Virat : ప్రస్తుతం భారత క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీ సరికొత్త జోష్‌ను నింపుతోంది. ఇందుకు ప్రధాన కారణం టీమ్ ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో బరిలోకి దిగడమే.

Rohit Virat : ప్రస్తుతం భారత క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీ సరికొత్త జోష్‌ను నింపుతోంది. ఇందుకు ప్రధాన కారణం టీమ్ ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో బరిలోకి దిగడమే. ఐపీఎల్ వేలంలో కోట్లు పలికే ఈ స్టార్లు, ఒక సాధారణ దేశవాళీ మ్యాచ్ కోసం ఎంత జీతం తీసుకుంటారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టార్ ఆటగాళ్లు కూడా మిగిలిన లోకల్ ప్లేయర్ల మాదిరిగానే బీసీసీఐ నిర్ణయించిన ఫిక్స్‌డ్ శాలరీనే తీసుకుంటున్నారు.
అనుభవానికే పెద్దపీట.. స్టార్‌డమ్‌కు కాదు
విజయ్ హజారే ట్రోఫీలో ఆటగాళ్ల జీతం వారి స్టార్‌డమ్ లేదా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆధారంగా ఉండదు. బీసీసీఐ నిర్ణయించిన లిస్ట్ ఏ మ్యాచ్‌ల అనుభవం ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. ఐపీఎల్లో ఆక్షన్ ద్వారా ధర నిర్ణయించబడితే, ఇక్కడ మాత్రం అనుభవానికి తగ్గట్టుగా మూడు కేటగిరీలుగా జీతాలు ఇస్తారు.
సీనియర్ కేటగిరీ (40 కంటే ఎక్కువ మ్యాచ్‌లు): వీరికి ఒక్కో మ్యాచ్‌కు రూ.60,000 ఇస్తారు. (విరాట్, రోహిత్ ఈ విభాగంలోనే ఉన్నారు).
మిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 మ్యాచ్‌లు): వీరికి మ్యాచ్‌కు రూ.50,000 చెల్లిస్తారు.
జూనియర్ కేటగిరీ (0 నుంచి 20 మ్యాచ్‌లు): వీరికి ఒక్కో మ్యాచ్‌కు రూ.40,000 అందుతుంది.
రిజర్వ్ బెంచ్ పై కూర్చునే ఆటగాళ్లకు ఇందులో సగం (రూ.30,000 నుంచి రూ.20,000 వరకు) లభిస్తుంది.
అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే ఇది తక్కువేనా?
అవును, టీమిండియా తరపున ఆడేటప్పుడు బీసీసీఐ ఒక్కో వన్డే మ్యాచ్‌కు సుమారు రూ.6 లక్షల మ్యాచ్ ఫీజు ఇస్తుంది. అంటే విజయ్ హజారే ట్రోఫీలో వచ్చే జీతం అంతర్జాతీయ మ్యాచ్ ఫీజులో కేవలం 10 శాతం మాత్రమే. అయినప్పటికీ, కివీస్ సిరీస్ కోసం ప్రాక్టీస్ కోసం, ఫామ్ నిరూపించుకోవడానికి కోహ్లీ (ఢిల్లీ), రోహిత్ (ముంబై) ఈ టోర్నీని వేదికగా చేసుకున్నారు.
అదనపు సంపాదన ఎలా?
కేవలం మ్యాచ్ ఫీజు మాత్రమే కాకుండా, ఆటగాళ్లకు ప్రయాణ, ఆహార ఖర్చుల కోసం డైలీ అలవెన్స్ ఇస్తారు. ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంటే మరో రూ.10,000 అదనంగా లభిస్తుంది. జట్లు నాకౌట్ దశకు లేదా ఫైనల్‌కు చేరుకుంటే బీసీసీఐ ఇచ్చే భారీ ప్రైజ్ మనీలో కూడా ఆటగాళ్లకు వాటా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఆంధ్రపై సెంచరీ బాది తన సత్తా చాటగా, రోహిత్ శర్మ సిక్కింపై సెంచరీ చేసి అభిమానులను అలరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
