Vaibhav Suryavanshi : స్కూల్‌కి వెళ్లే వయసులో సెంచరీల మీద సెంచరీలు..కానీ వైభవ్ సూర్యవంశీ ఆ ఒత్తిడిని తట్టుకోగలడా?
Vaibhav Suryavanshi : ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే దిగ్గజాలను తలదన్నేలా రికార్డులను తిరగరాస్తున్న ఈ బీహార్ కుర్రాడు, టీమ్ ఇండియాకు దొరికిన ఒక అద్భుతమైన వజ్రం.

Vaibhav Suryavanshi : ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే దిగ్గజాలను తలదన్నేలా రికార్డులను తిరగరాస్తున్న ఈ బీహార్ కుర్రాడు, టీమ్ ఇండియాకు దొరికిన ఒక అద్భుతమైన వజ్రం. 2025 సీజన్‌లో దేశవాళీ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు ఈ లిటిల్ మాస్టర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, ఇంత చిన్న వయసులో అతనిపై పెడుతున్న అంచనాలు, ఒత్తిడి అతని కెరీర్‌కు మేలు చేస్తాయా? లేక శాపంగా మారుతాయా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూస్తుంటే ఒక తరం నుంచి మరో తరానికి అరుదుగా వచ్చే ఆటగాడనిపిస్తుంది. ఈ ఏడాది అతను సాధించిన విజయాలు అమోఘం.
విజయ్ హజారే ట్రోఫీ (2025): అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: మహారాష్ట్రపై 108 పరుగులు (61 బంతుల్లో) చేసి, ఈ టోర్నీలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
అండర్-19 ఆసియా కప్: ఈ టోర్నీలో యూఏఈపై 171 పరుగులు బాదడమే కాకుండా, మొత్తం 261 పరుగులతో భారత్‌కు వెన్నెముకగా నిలిచాడు.
ఐపీఎల్ 2025: రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ గుజరాత్ టైటాన్స్‌పై 101 (38 బంతుల్లో) పరుగులు చేసి, ఐపీఎల్‌లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
అతి పిన్న వయసులోనే మిలియనీర్
2025 ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కాంట్రాక్ట్ పొందిన అత్యంత పిన్న వయస్కుడు వైభవే. రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల పర్యవేక్షణలో మెరుగుపడుతున్న ఈ కుర్రాడు, తన తొలి మ్యాచ్‌లోనే మొదటి బంతికే సిక్స్ కొట్టి తన ఫియర్ లెస్ ఆటతీరును ప్రపంచానికి చాటాడు.
అంచనాల ఒత్తిడి భయం
ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ బాదుతున్నాడంటే, వైభవ్‌పై అభిమానులకు, మీడియాకు అంచనాలు పెరిగిపోవడం సహజం. సచిన్ టెండూల్కర్, ఇషాన్ కిషన్ వంటి స్టార్లతో పోలికలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే, కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంతటి భారీ అంచనాలను మోయడం కత్తి మీద సాము వంటిదే. ఒకవేళ కొన్ని మ్యాచుల్లో విఫలమైతే వచ్చే విమర్శలు ఆ పసి హృదయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్లు సైతం.. “అతనిపై ఒత్తిడి తగ్గించండి, అతని ఆటను అతన్ని ఆడనివ్వండి” అని సూచిస్తున్నారు. సచిన్ తర్వాత ఆ స్థాయి టాలెంట్ ఉన్న ఆటగాడిగా వైభవ్‌ను అభివర్ణిస్తున్నా, అతనికి తగినంత సమయం, స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
