Abhishek Sharma : అభిషేక్ శర్మను విమర్శిస్తారా? బ్యాట్ స్వింగ్ చూసి మాట్లాడండి.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్, అభిషేక్‌ను ఉద్దేశించి చేసిన లప్పేబాజ్(గుడ్డిగా బ్యాట్ ఊపేవాడు) అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్, అభిషేక్‌ను ఉద్దేశించి చేసిన లప్పేబాజ్(గుడ్డిగా బ్యాట్ ఊపేవాడు) అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వరుసగా మూడు సార్లు డకౌట్ అయినప్పుడు అభిషేక్‌ను విమర్శించిన వారందరికీ, జింబాబ్వేపై 55 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అతను గట్టి సమాధానం ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంలోకి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇచ్చి, మహమ్మద్ అమీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
అభిషేక్ శర్మను లప్పేబాజ్ అనడంపై అశ్విన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభిషేక్ ఆడే తీరును ఎవరైనా విమర్శించవచ్చు కానీ, అతనికి టెక్నిక్ లేదని అనడం తగదని అశ్విన్ స్పష్టం చేశారు. “ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్ స్వింగ్(బ్యాట్ ఊపే వేగం, శైలి) ఉన్న ఆటగాళ్లలో అభిషేక్ ఒకడు. మనందరికీ తెలుసు, యువరాజ్ సింగ్ అతనికి మెంటార్‌గా ఉన్నారని. నా ఉద్దేశంలో అభిషేక్ బ్యాట్ స్వింగ్ స్వయానా యువరాజ్ సింగ్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంతకంటే అందమైన బ్యాట్ స్వింగ్‌ను మనం ఊహించలేం” అంటూ అశ్విన్ ఆకాశానికెత్తారు.
అభిషేక్ శర్మ బంతిని బాదినప్పుడు అది చాలా దూరం వెళ్తుందని, ఆ పవర్ చూసి కొందరు అతను గుడ్డిగా ఆడుతున్నాడని పొరపడుతుంటారని అశ్విన్ విశ్లేషించారు. అయితే అభిషేక్ చేయాల్సిన చిన్న మార్పును కూడా అశ్విన్ సూచించారు. “ప్రతి బంతినీ బౌండరీ దాటించాలని చూడటమే అభిషేక్ చేస్తున్న చిన్న పొరపాటు. దానివల్ల కొన్నిసార్లు వికెట్ పారేసుకుంటున్నాడు” అని చెప్పారు. అయినప్పటికీ, అతని షాట్లలో ఉండే క్లారిటీ మరియు టైమింగ్‌ను తక్కువ అంచనా వేయలేమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
వరల్డ్ కప్ ఆరంభంలో వరుసగా మూడు సార్లు సున్నాకే అవుట్ అయినప్పుడు అభిషేక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. సౌతాఫ్రికా పై కేవలం 15 పరుగులకే పరిమితమైనా, జింబాబ్వేతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ రేసులో నిలిచింది. అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాడు అభిషేక్‌ను వెనకేసుకురావడంతో, విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అభిషేక్ ఇదే దూకుడును ప్రదర్శిస్తాడని భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
