AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Aus : వరల్డ్ ఛాంపియన్లకు షాక్.. వన్డే సిరీస్‌ను పట్టేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు

Ind Vs Aus : వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. గతేడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే.

Ind Vs Aus : వరల్డ్ ఛాంపియన్లకు షాక్.. వన్డే సిరీస్‌ను పట్టేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు
Ind Vs Aus
Rakesh
|

Updated on: Feb 27, 2026 | 5:48 PM

Share

Ind Vs Aus : వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. గతేడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. అయితే, పొట్టి ఫార్మాట్ (T20)లో అదరగొట్టిన మన అమ్మాయిలు, వన్డేల్లో మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలయ్యారు. హోబర్ట్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన ఆసీస్, ఇప్పుడు స్వదేశంలో వరుస విజయాలతో దానికి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31), ప్రతికా రావల్ (52) తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రతికా తన అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడింది. 100 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పోరాడినప్పటికీ, అవతలి వైపు నుంచి ఆమెకు సరైన సహకారం అందలేదు. కాశ్వీ గౌతమ్ (25) తో కలిసి హర్మన్ 55 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కానీ, ఆస్ట్రేలియా బ్యాటర్ల జోరు ముందు ఈ లక్ష్యం చాలా చిన్నదైపోయింది.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్, జార్జియా వాల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తన కెరీర్‌లో చివరి సిరీస్ ఆడుతున్న ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ (6) త్వరగానే అవుట్ అయినప్పటికీ, ఆ జట్టు ఏమాత్రం ఒత్తిడికి లోను కాలేదు. లిచ్‌ఫీల్డ్ కేవలం 62 బంతుల్లో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించగా, 22 ఏళ్ల జార్జియా వాల్ (101 పరుగులు, 82 బంతులు) సెంచరీతో చెలరేగిపోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా జార్జియా వాల్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఆసీస్ విజయాన్ని సులభతరం చేసింది.

భారత బౌలర్లు మధ్యలో మూడు వికెట్లు తీసి పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆస్ట్రేలియా కేవలం 36.1 ఓవర్లలోనే, అంటే మరో 83 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హర్మన్‌ప్రీత్ సేన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి వన్డే సిరీస్‌లోనే ఓటమిని చవిచూడటం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. సిరీస్ కోల్పోయిన భారత్, కనీసం చివరి మ్యాచ్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. సిరీస్‌లో మూడో వన్డే ఇదే వేదికపై మార్చి 1న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us