Guru Gochar 2025: మిథున రాశిలోకి గురువు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
Guru Grah Gochar 2025: మే 25న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్ని రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలు ఉన్నప్పుటికీ.. మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం, ఉద్యోగంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటివి ఎదురవుతాయి. ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం చాలా ముఖ్యం.

Jupiter in Gemini 2025: మే 25న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం జరుగుతుంది. అది ఇక్కడ ఏడాదిపాటు సంచారం చేస్తుంది. గురువు మిథున రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశులకు ధన యోగాలు, అధికార యోగాలు పట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ మరి కొన్ని రాశులకు బాగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు ధన, గృహ, పుత్ర, శుభ కార్యాలకు కారకుడు. గురువు దుస్థానాల్లో సంచారం చేస్తున్న ప్పుడు ఈ కారకత్వాలు బాగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి గురువు దుస్థానాల్లో ప్రవేశించడం జరుగుతోంది. అందువల్ల ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల గురువు దుష్ఫలితాలు తగ్గుతాయి.
- మేషం: ఈ రాశికి గురువు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఈ రాశివారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండకపోవచ్చు. వీరి సేవలు ఉపయోగించుకున్నవారు మొండి చెయ్యి చూపించే అవ కాశం ఉంటుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయ మార్గాలు తగ్గిపోవడం గానీ, సరైన ఆర్థిక లాభం కలగకపోవడం గానీ జరుగుతుంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. ఈ రాశివారిలో ఆత్మ విశ్వాసం, చొరవ, ధైర్యం వంటివి బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించకపోవచ్చు. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరుగు తుంది కానీ, అందుకు తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. తక్కువ వేతనానికి దూర ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి వస్తుంది. కుటుంబ జీవితం అసంతృప్తి కలిగిస్తుంది. ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి 12వ స్థానంలో, అంటే వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉచిత సహాయాల వల్ల, వృథా ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆదాయం తగ్గే అవకాశం కూడా ఉంది. పనికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. ఆస్తి సమస్యలు లేదా వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. శుభ కార్యాలు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి విమర్శలు, వేధింపులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు కూడా మందకొడిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు చేజారే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి మందకొడిగా ముందుకు సాగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు. ఆర్థిక విషయాల్లో మిత్రులు సైతం మోసగించే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందక, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి రావు. ఇష్టమైన బంధు మిత్రులు దూరం అవుతారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల డబ్బు నష్టపోవడం లేదా మోసపోవడం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అత్యంత సన్నిహితులను సైతం నమ్మకపోవడం మంచిది. గతంలో సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. గృహ ప్రయత్నాలకు విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో అకారణ వైరాలు తలెత్తే అవకాశం కూడా ఉంది.



