MLA Ticket: ఒక్కఛాన్స్ అంటూ సీఎం చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు ఎవరు..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లపైనా సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు, పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్తున్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, అర్హత ఉండీ పథకాలు అందని వారికి కొత్తగా పథకాలు అందేలా చూడటం ద్వారా చర్యలు తీసుకున్నారు. ఇక గడప గడపకూ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు వర్క్ షాప్‌లు కూడా నిర్వహించారు సీఎం జగన్. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక నేతలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఎక్కడైనా వ్యతిరేకత ఉంటే ఎందుకు అలాంటి పరిస్థితి ఉందనే దానిపై నివేదికలు తెప్పించుకునే వారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సమీక్షల్లో పనితీరు బాగోలేని నేతలకు సున్నితంగా హెచ్చరికలు చేసేవారు. ఇక రెండు, మూడు సార్లు హెచ్చరించినా పనితీరు బాగోలేని నేతలకు సీట్లు ఇవ్వలేనని కూడా చెప్పేసారు. ఇలాంటి వారిలో ప్రస్తుతం ఓ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిసింది. ఆయా అభ్యర్ధులకు సీట్లు లేవని ఇప్పటికే పరోక్షంగా సంకేతాలివ్వడంతో ఆయా నేతలు సీట్ల కోసం తంటాలు పడుతున్నారు.
సీఎం చుట్టూ తిరుగుతున్న అభ్యర్దులు
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంకు కొనసాగింపుగా జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకూ మొత్తం ప్రజల్లోనే ఉండేలా చూస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని అనిపిస్తేనే తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక ఇప్పటి వరకూ పనితీరు మెరుగుపరుచుకోలేని నాయకులకు సీట్లు ఇవ్వలేమని కూడా చెప్పేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఎవరికైతే సీటు రావడం లేదని తెలిసిందో అలాంటి నాయకులు సీఎం చుట్లూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ పనితీరు మెరుగుపరుచుకుంటామని.. తమకు మరో ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇలాంటి వారిలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో పాటు మరికొంత మంది ఉన్నారని తెలిసింది. నేరుగా సీఎంను కలిసే ప్రయత్నం చేయడం.. లేనిపక్షంలో సీఎం కార్యాలయంలో అధికారుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
మరికొంత మంది సజ్లల రామకృష్ణా రెడ్డి ద్వారానూ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇలాంటి వారిలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్లుణ, పాడేరు ఎమ్మెల్యే కొత్తగుళ్లు భాగ్యలక్ష్మి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పాటు ఇంకొంత మంది సీటు సాధించుకునే పనిలో పడ్డారు. ఇక ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా హిందూపురం స్థానం ఆశిస్తున్నారు. ఈయనకు కూడా సీటు ఇవ్వలేనని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. వీరితో పాటు మాజీ హెంమంత్రి సుచరిత కూడా మళ్లీ తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా సుచరిత తన మంత్రిపదవి కోల్పోయారు. అప్పట్లో అధిష్టానం పై అలిగిన సుచరిత.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ తన మనసు మార్చుకున్నారు. మళ్లీ తనకు ప్రత్తిపాడు సీటు ఇవ్వాలని సీఎం జగన్ ను అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సిట్టింగ్‌లను మార్చే స్థానాల్లో ముందస్తు జాగ్రత్తలు
ఎన్నికల సమయంలో సిట్టింగ్ అభ్యర్ధులు ఏదేని కారణాలతో సీటు కోల్పోయినట్లయితే అలాంటి చోట్ల పార్టీకి నష్టం లేకుండా వైఎస్ఆర్ సీపీ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఆయా స్థానాల్లో పార్టీలో గ్రూపు విభేదాలు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. సీటు ఇవ్వలేని సిట్టింగ్‌లకు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తామని ముందుగానే చెబుతుంది. దీనిద్వారా ఆయా అభ్యర్ధులకు పార్టీపై వ్యతిరేకత లేకుండా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. వీలైనంత త్వరగా సీట్లు కోల్పోయే అభ్యర్ధులకు సమాచారం ఇచ్చి వర్గవిభేదాలకు తావులేకుండా ఉండేలా వైసీపీ కసరత్తు చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..