AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెల నుంచి పట్నం బాట పట్టిన ఒంటరి ఏనుగు.. మళ్లీ రచ్చ రచ్చ.. భయాందోళనలో స్థానికులు

గుంపులో కలిసికట్టుగా సంచరించిన ఏనుగు గత కొద్దిరోజులుగా గుంపుకు దూరంగా ఉంటుంది. నిత్యం గుంపులో ఉండే హరి అనే ఏనుగు ఒక్కసారిగా గుంపుకు దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంది. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున గీంకారాలు చేస్తూ గ్రామాల పై పడుతుంది.

పల్లెల నుంచి పట్నం బాట పట్టిన ఒంటరి ఏనుగు.. మళ్లీ రచ్చ రచ్చ.. భయాందోళనలో స్థానికులు
Elephant
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 6:30 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో హరి అనే ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. గుంపు నుండి విడిపోయి జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఏనుగు ధాటికి పార్వతీపురం మన్యం జిల్లా వాసులు హడలెత్తి పోతున్నారు. గుంపులో కలిసికట్టుగా సంచరించిన ఏనుగు గత కొద్దిరోజులుగా గుంపుకు దూరంగా ఉంటుంది. నిత్యం గుంపులో ఉండే హరి అనే ఏనుగు ఒక్కసారిగా గుంపుకు దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంది. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున గీంకారాలు చేస్తూ గ్రామాల పై పడుతుంది. పంట నష్టం చేయడంతో పాటు గ్రామాల్లోని పశువుల పై సైతం దాడి చేస్తుంది. పశువుల సాలలను, పంట పొలాలను ధ్వంసం చేస్తుంది. ఎప్పుడైనా గుంపు నుండి తప్పిపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో గుంపులో కలిసిపోయే ఏనుగు ఈ సారి మాత్రం రెండు నెలలు దాటినా గుంపులో కలవలేదు. తమ ఏనుగుల గుంపులో కలవడానికి నానా అవస్థలు పడుతుంది. దీంతో రెచ్చిపోయి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒంటరిగా తిరుగుతూ భీభత్సం చేస్తున్నా అటవీశాఖ అధికారులు సైతం ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఒంటరి ఏనుగు హరి రోజుకు ముప్పై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించే సమయంలో ఎటు వైపు వెళ్తుందో కూడా తెలియక పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొమరాడ మండలం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల మేర ప్రయాణించి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం అయిన పార్వతీపురం చేరుకొని రైల్వే స్టేషన్ సమీపంలో సంచరించి హల్ చల్ చేసింది. ఏనుగును చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

అసలే రెచ్చిపోయి సంచరిస్తున్న ఏనుగు, దానికి తోడు పట్టణంలోకి రావడంతో అటు అధికారులు, ఇటు పట్టణవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తరువాత అక్కడ నుండి తిరిగి కొమరాడ మండలంలోని పరిసర గ్రామాలకు చేరుకుంది. దీంతో ఎప్పుడు ఏ గ్రామం పై పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు స్థానికులు. మరో వైపు ఏనుగుల గుంపు పై కూడా అధికారులు పర్యవేక్షణ పెంచారు. ఒంటరి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు రెచ్చిపోయి గ్రామాల మీద పడుతాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఏనుగు గుంపులో కలిసే అవకాశం లేదని చెప్తున్నారు. ఒంటరి ఏనుగుతో పాటు మిగిలిన ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..