AP News: టోల్ ఫ్లాజా దగ్గర వాహన తనిఖీలు.. కారులో చెక్ చేసి కళ్లు తేలేసిన ఖాకీలు..!

శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం టోల్ ప్లాజా వద్ద కాశీబుగ్గ అటవీ రేంజ్ అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా సోమవారం ఓ కారులో అక్రమంగా తరలిస్తోన్న 20 వన్యప్రాణులను గుర్తించారు. అందులో 17 ఆఫ్రికన్ బ్రీడ్ కి చెందిన కొండచిలువ పిల్లలు, ఒక అడవి పిల్లి, రెండు తాబేళ్లు ఉన్నాయి.

AP News: టోల్ ఫ్లాజా దగ్గర వాహన తనిఖీలు.. కారులో చెక్ చేసి కళ్లు తేలేసిన ఖాకీలు..!
Wild Animals Caught In Car At Purushottapuram Toll Plaza
Follow us
S Srinivasa Rao

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 12, 2024 | 6:21 PM

వన్యప్రాణుల సంరక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా కేటుగాళ్లు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మెడిసిన్ తయారీలలో, వస్తువుల తయారీ కోసమో, ఇంట్లో ఉంటే మంచిదన్న సెంటిమెంట్ కోసమో వన్యప్రాణులను బలి తీసుకుంటున్నారు. అయితే ఇటీవల వివిధ రకాల పాములను, కొండచిలువలను పెంచుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. దీంతో వీటిల్లో కూడా కుక్కలు మాదిరిగా ఫారిన్ బ్రీడ్ వన్యప్రాణులను దిగుమతులు చేసుకుంటున్నారు. వీటికి మార్కెట్లో బాగా క్రేజ్ కూడా ఉంది. దీంతో అధికారుల కళ్లుకప్పి గుట్టుగా వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యాపారం సాగిస్తున్నారు.

ఎక్కడి నుంచి వన్యప్రాణులు ఎగుమతి అవుతున్నాయి?

ఒడిశా నుండి ఇతర రాష్ట్రాలకు వన్యప్రాణుల ఎగుమతి కొనసాగుతుంది. ఒడిశాలో అడవులకు, ఎత్తైన పర్వతశ్రేణులకు కొదవ లేదు. ఎంతో విలువైన అటవీ, ఖనిజ సంపద ఇక్కడ ఉంది. అందుకే ఇక్కడ పోలీసు, నిఘా వర్గాల కళ్ళు కప్పి గంజాయి సాగుతో పాటు, వివిధ రకాల స్మగ్లింగ్ కూడా జోరుగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ వన్యప్రాణులను కూడా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు కేటుగాళ్లు. అడవిలో దొరికే వాటినే కాకుండా వివిధ రకాల ఫారిన్ బ్రీడ్ లను తెచ్చి ఒడిశాలోనే వాటిని గుట్టుగా పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం టోల్ ప్లాజా వద్ద కాశీబుగ్గ అటవీ రేంజ్ అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా సోమవారం ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 20 వన్యప్రాణులను గుర్తించారు. అందులో 17 ఆఫ్రికన్ బ్రీడ్ కి చెందిన కొండచిలువ పిల్లలు, ఒక అడవి పిల్లి, రెండు తాబేళ్లు ఉన్నాయి.

వాటిని ఒడిశా నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు టయోటా ఫార్చ్యునర్ కార్లో తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కారులో ఉన్న ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వన్యప్రాణులను వాటి సంరక్షణ దృష్ట్యా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విశాఖ జూకి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వైల్డ్ యానిమాల్స్ ఫారిన్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

గతంలోను అడపాదడపా అధికారులు జరిపే దాడులలో ఇలా ఒడిశా నుండి వన్య ప్రాణులను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ దొరికిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒడిశా నుండి గుట్టుగా రైళ్ళు, ప్రైవేట్ వాహనాల్లో కేటుగాళ్లు వన్యప్రాణులను తరలిస్తున్నారు. అడవిలో స్వేచ్చగా తిరగాల్సిన వణ్యప్రాణులు కేటుగాళ్లు చేతిలో బలైపోతున్నాయి. ఇప్పటికైనా నిఘాను మరింతగా పెంచి వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని జంతు ప్రేమికులు అధికారులను కోరుతున్నారు. అవసరమైతే చట్టాన్ని మరింత బలోపేతం చేసి మూగ జీవాలను సంరక్షించాలని వేడుకుంటున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి