AP Survey: మీకు ప్రభుత్వ పథకాలు కావాలా..? ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి సర్వే..
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఫ్యామిలీ డీటైల్స్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. నెల పాటు సర్వే జరగనుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫ్యామిలీ సర్వే నిర్వహించనుంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 పేరుతో అధికారులు ప్రతీ గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ స్థాయి వివరాలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరడంతో పాటు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీకి ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ డేటానే ఇక నుంచి ఆధారంగానే తీసుకోనున్నారు. దీంతో ఈ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ప్రతీఒక్కరికీ కీలకమని చెప్పవచ్చు.
సర్వే ఎలా చేస్తారు?
ఈ సర్వే కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తయారుచేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. 100 శాతం ఈకేవైసీ ఆధారంగా చేయనున్నారు. అలాగే వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ స్థాయి వివరాలను సేకరించనున్నారు. ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి, ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు, సామాజిక, కుటుంబ మ్యాపింగ్ సమాచారం సేకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 12 వరకు ఈ సర్వే చేపట్టనున్నారు.
సచివాలయ ఉద్యోగులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతీ ఇంటికి వెళ్లి యాప్ ద్వారా వివరాలు సేకరించనున్నారు. కుటుంబ ఆర్ధిక, సామాజిక పరిస్థితి తెలుసుకోనున్నారు. విద్య, ఉద్యోగ వివరాలు సేకరించనున్నారు. అర్హుల లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు ఈ వివరాలు ప్రభుత్వానికి ఉపయోగపడనున్నాయి. ఇక ఈ సర్వే ద్వారా పథకాల అనర్హులను కూడా గుర్తించేందుకు వీలు పడుతుంది. కొంతమందికి అర్హత లేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఉచిత వంటగ్యాస్, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాల్లో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానపడుతుంది. ఈ సర్వేలో వారి వివరాలు కూడా బహిర్గతం కానున్నాయి.




