భర్తను హతమార్చి చెరువులో పడేసిన భార్య.. నిందితులు ఎలా చిక్కారంటే..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనుకున్నారు. హత్య చేసి పెట్రోల్ బంక్ వద్ద తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని సంచిలో వేసుకొని చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రియుడితో కలిసి సొంత భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన ఖాదర్ బాషా ఐచర్ వాహన డ్రైవర్. ఖాదర్ బాషాకు భార్య గులాబ్ జాన్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఖాదర్ భాషాకు కదిరి పట్టణం నిజాంవలి కాలనీకి చెందిన బాబ్జాన్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఖాదర్ బాషా భార్య గులాబ్ జాన్, బాబ్జాన్ల మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి సంబంధాన్ని తెలుసుకున్న ఖాదర్ బాషా భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు కనిపించలేదు.
దీంతో ఖాదర్ బాషా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త ఖాదర్ బాషాను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని గులాబ్ జాన్, ప్రియుడు బాబ్జాన్ నిర్ణయించుకున్నారు. గత నెల 31న మద్యం మత్తులో ఉన్న ఖాదర్ బాషాను హత్యచేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచుకుని ద్విచక్ర వాహనంపై కదిరి మండలం కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోలును ఖాదర్ బాషాపై పోసి తగలబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో సగం కాలిన శవాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని దగ్గరలోని చెరువులో పడేసి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఏమి ఎరగనట్టు తన భర్త ఖాదర్ బాషా డ్రైవింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదంటూ భార్య గులాబ్ జాన్ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుత టెక్నాలజీ ఆధారంగా భర్త ఖాదర్ బాషా ఫోన్ లొకేషన్ ద్వారా కేసును ఛేదించారు. మృతుడి సెల్ ఫోన్ సున్నపుగుట్టతండా పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ లొకేషన్లో కదలికలు లేకపోవడంతో పోలీసులకు మృతుడి భార్యపై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మృతుడి భార్య గులాబ్ జాన్‌తోపాటు ఆమె ప్రియుడు బాబ్జాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెరువులో పారేసిన ఖాదర్ బాషా మృతదేహాన్ని పోలీసులు రికవరీ చేయడంతో మర్డర్ మిస్టరీ వీడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




