Jana Sena: పవన్ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య వరుస లేఖలు.. పేర్కొన్న అంశాలివే..
జనసేన అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేశారు.. కాపు నేత హరిరామ జోగయ్య. టీడీపీ-జనసేన పొత్తులే ఖరారు కాలేదు.. అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ఏంటంటరా..? నిజమే..రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిన 41 అసెంబ్లీ.. 6 పార్లమెంటు స్థానాలను సూచించిన హరిరామజోగయ్య.. అభ్యర్థులను కూడా తానే అనౌన్స్ చేశారు.
జనసేన అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేశారు.. కాపు నేత హరిరామ జోగయ్య. టీడీపీ-జనసేన పొత్తులే ఖరారు కాలేదు.. అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ఏంటంటరా..? నిజమే..రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిన 41 అసెంబ్లీ.. 6 పార్లమెంటు స్థానాలను సూచించిన హరిరామజోగయ్య.. అభ్యర్థులను కూడా తానే అనౌన్స్ చేశారు. తాను రాసిన ఒక్కలేఖకు కూడా పవన్ కల్యాణ్ స్పందించకపోయినా.. హరిరామజోగయ్య మాత్రం వదలడం లేదు. లేఖలపై లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా పవన్‌కు మరో లేఖాస్త్రం సంధించారు జోగయ్య. రానున్న ఎన్నికల్లో 41 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామజోగయ్య.. ఆ స్థానాల్లో అభ్యర్థులను కూడా తానే ప్రకటించారు. ఆ స్థానాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని.. వాటికోసం పోరాడాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు.
పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు..జోగయ్య. అలాగే పవన్ సోదరుడు నాగబాబు తిరుపతి అసెంబ్లీతో పాటు..అనకాపల్లి పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దిగాలన్నారు. అలాగే తాడేపల్లి గూడెం అసెంబ్లీ స్థానం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, కాకినాడ సిటీ నుండి చిక్కాల దొరబాబు, కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ, పెందుర్తి నుండి పంచకర్ల రమేష్, అనకాపల్లి నుండి బొలిశెట్టి సత్యనారాయణ, రాజంపేటనుండి ఎమ్.వి.రావు, గజపతినగరం నుండి పడాల అరుణను పోటీ చేయించాలని చెప్పారు హరిరామ జోగయ్య. అలాగే నర్సాపురం పార్లమెంటు స్థానం నుండి మల్లినీడు తిరుమలరావు, కాకినాడ నుండి సాన సతీష్, మచిలీపట్నం నుండి బాల సూరి, అనకాపల్లి నుండి కొణిదెల నాగబాబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ, రాజంపేట – యం.వి. రావు, విజయనగరం నుండి గేదెల శ్రీనివాస్‌ను బరిలో నిలపాలని చెప్పారు.
కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 6 స్థానాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామజోగయ్య ఆ స్థానాల్లో టికెట్లు ఇవ్వాల్సిన నేతల పేర్లను కూడా సూచించారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో 7, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో బరిలోకి దిగాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో 9 స్థానాల్లోనూ..ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 5 స్థానాలను కోరాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో పవన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు జోగయ్య. ఈ పది రోజుల్లోనే 4 లేఖలు రాశారాయన.
టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జనాభా నిష్పత్తిలో జరుగుతోందా లేదా అని ఇటీవల ప్రశ్నించారు. యాచించే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి రావాలని కాపు కులస్తులు ఆలోచిస్తున్నారని..పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా సీట్లను డిమాండ్ చేయాలని స్పష్టం చేశారు. ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే నష్టం..టీడీపీ అనుభవించాల్సి వస్తుందని కూడా హరిరామజోగయ్య తన విశ్లేషణలో హెచ్చరిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల కాకముందే జోగయ్య రాస్తున్న లేఖలు ఆ పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి. మరి పెద్దాయన రాసిన ఈ లేఖకైన జనసేన అధినేత స్పందిస్తారో లేక ఎప్పటిలానే లైట్ తీసుకుంటారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..