Vizianagaram: సంచలనం సృష్టించిన ఏసిబి కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే విధుల్లో ఏఈ..
Vizianagaram: శాంతారావును విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు హజరు పరిచారు. అయితే కేసును పరిశీలించిన కోర్టు శాంతారావు కు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఏసిబి అధికారులు వెంటనే 41ఏ నోటీసులు ఇవ్వడం, శాంతారావును విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. అలా విడుదల అయిన మరుక్షణమే మక్కువ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆఫీస్ లో విధులకు హాజరయ్యాడు. ఆఫీస్ కి వచ్చిన శాంతారావు కు ఆఫీస్ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి..
పార్వతీపురం మన్యం జిల్లా, సెప్టెంబర్ 3: ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన ఎలక్ట్రికల్ ఏఈ పోలాకి శాంతారావు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏసిబి అధికారులకే సవాలు విసిరి అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే విధులకు హాజరై సంచలనం సృష్టించాడు శాంతారావు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మునక్కాయ వలస వద్ద గత నెల 27 న ఈశ్వర రావు అనే ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా ఎలక్ట్రికల్ ఏఈ శాంతారావును ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు ఏసిబి అధికారులు. అయితే ఆ సమయంలో ఏసిబి అధికారులను గమనించిన శాంతారావు కారులో డోర్స్ వేసుకొని ఎదురుగా ఉన్న పంట పొలాల్లోకి కారుతో దూసుకెళ్లి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఎలాగైనా శాంతారావును పట్టుకోవాలని ప్రయత్నించిన ఏసిబి సి ఐ శ్రీనువాసరావు వెంటనే ప్రక్కనే ఉన్న ఒక బైక్ తీసుకొని కారును వెంబడించాడు. అలా చేజ్ చేస్తున్నప్పటికీ ఏ ఈ శాంతారావు ఏ మాత్రం తగ్గకుండా సిఐ బైక్ ని తన కారుతో బలంగా ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సిఐ శ్రీనువాసరావు ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నా గాయాల పాలయ్యాడు. దీంతో మిగిలిన సిబ్బంది శాంతారావ్ కోసం వెంబడించిన ఫలితం లేదు. రాత్రి సమయం కావడంతో ఏసిబి అధికారులకు దొరక్కుండా తప్పించుకోగలిగాడు.
అయితే జరిగిన ఘటనతో ఖంగు తిన్న ఏసిబి అధికారులు ప్రత్యేక బృందాలతో గాలించిన అధికారులు ఎట్టకేలకు ఏ ఈ శాంతారావును విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు హజరు పరిచారు. అయితే కేసును పరిశీలించిన కోర్టు శాంతారావు కు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఏసిబి అధికారులు వెంటనే 41ఏ నోటీసులు ఇవ్వడం, శాంతారావును విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. అలా విడుదల అయిన మరుక్షణమే మక్కువ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆఫీస్ లో విధులకు హాజరయ్యాడు. ఆఫీస్ కి వచ్చిన శాంతారావుకు ఆఫీస్ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం గా మారి అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఏసిబి అధికారులను ముప్పు తిప్పలు పెట్టడంతో పాటు కారుతో సి ఐ ను ఢీకొట్టి పరారైన ఎలక్ట్రికల్ ఏ ఈ శాంతారావు ఎలా అంత ఈజీగా క్షణాల్లో విధుల్లోకి జాయిన్ అవ్వగలిగాడు అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ వ్యవహారంలో ఏఈ శాంతారావు అటు అధికారులు, పలువురు రాజకీయ నాయకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా ఏసిబి డిఎస్పీ రామచంద్రరావు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఎస్పీ రామచంద్ర రావు, శాంతారావు ఒకే సామాజిక వర్గం వారు కావడంతో శాంతారావుకు తక్షణమే బెయిల్ వచ్చేలా డిఎస్పీ కూడా సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందుకోసమే కేసు వీక్ అయ్యేలా ఫైల్స్ తయారు చేశారని చెప్పుకొస్తున్నారు. దీంతో అనుకున్నట్లే కేసు పరిశీలించిన కోర్టు శాంతారావు కు 41ఏ నోటీస్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించిందని, అలా శాంతారావు అరెస్ట్ నుండి తప్పించుకోగలిగాడని అంటున్నారు. ఏసిబి అధికారుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో అడ్డుకున్న ఏసిబి, సి ఐ శ్రీనివాసరావుని శాంతారావు కారుతో ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సి ఐ శ్రీనువాసరావు తీవ్ర గాయాల పాలయ్యాడు. విధి నిర్వహణలో ఉన్న సి ఐ పై దాడితో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సి ఉండగా ఆ సంబంధిత సెక్షన్ల క్రింద కూడా కేసు నమోదు చేయకుండా శాంతా రావుకు సహకరించారని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా సుమారు ఐదు రోజుల పాటు పరారీ కారణంగా మండల విద్యుత్ ఆఫీస్ కి హజరుకాకుండా, సెలవు కూడా పెట్టని శాంతారావు పై అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మరింత అనుమానాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఏసిబి అధికారుల పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నా, వారు కనీసం పెదవి విప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమ పై వస్తున్న విమర్శలు, ఆరోపణల పై ఏసిబి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..