రైతన్నలకు మంచి రోజులు రాబోతున్నాయి.. నార్లాపూర్ పంప్ హౌజ్‌లోని మొదటి పంప్ సిద్ధం.. ఈ రోజే పాలమూరు డ్రైరన్..
Telangana: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 6 దశల్లో నీటిని ఎత్తి పోయాల్సి ఉంది. అందుకు సంబంధించిన పనులను ప్రభుత్వం మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. వాటిల్లో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టింది. అందులో ఇంకా 4 పంప్‌హౌజ్‌లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెంల పంప్‌హౌజ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఉద్దండాపూర్ పంప్‌హౌజ్ పనులు శరవేగంగా..
తెలంగాణ, సెప్టెంబర్ 3: తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలక దశకు చేరుకుంది. చీఫ్ ఇంజినీర్ హమీద్ ఖాన్, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి అధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికార యంత్రాంగం నార్లాపూర్ పంపుహౌజ్‌లోని మొదటిపంపు డ్రైరన్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 6 దశల్లో నీటిని ఎత్తి పోయాల్సి ఉంది. అందుకు సంబంధించిన పనులను ప్రభుత్వం మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. వాటిల్లో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టింది. అందులో ఇంకా 4 పంప్‌హౌజ్‌లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెంల పంప్‌హౌజ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఉద్దండాపూర్ పంప్‌హౌజ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో మొత్తం 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 పంపులను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏదుల, వట్టెంల పంప్‌హౌజ్‌లలో 9+1 చొప్పున, ఉద్దండాపూర్‌లో 4+1 చొప్పున పంపులను అమర్చాలి. ఇప్పటికే నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో 2, ఏదులలో 3, వట్టెంలో 3 పంపుల అమరిక పూర్తయింది. ఈ నేపథ్యంలోనే నార్లాపుర్ పంప్‌హౌజ్‌లో అమర్చిన మొదటి పంప్ డ్రైరన్‌ను ఆదివారం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నార్లాపూర్ పంప్‌హౌజ్ దగ్గర ఏర్పాటు చేసిన 400 కేవీ సబ్‌స్టేషన్ టెస్టింగ్ పనులను నిర్వహించగా.. అది విజయవంతం అయింది. మొదటి పంపుకు సంబంధించిన కంట్రోల్ ప్యానల్, ఇతర ఎలక్ట్రో మెకానికల్ విభాగాల పనితీరును టెస్ట్ చేయగా, అవి కూడా అనుకున్న ఫలితాలను ఇచ్చాయి.
దీంతో పూర్తిస్థాయిలో మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన పనులను చీఫ్ ఇంజినీర్ హమీద్‌ఖాన్, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పంప్ డ్రైరన్‌ను ప్రారంభిస్తారు. దీన్ని అంతటినీ విజయవంతంగా పూర్తిచేసి, వెట్న్‌క్రు సిద్ధం అమవుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉండగా పాలమూరు ప్రాజెక్టు మొదటి పంప్ డ్రైరన్‌కు సిద్ధమవడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీసేందుకు, ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యేందుక ఇక ఎంతో కాలం పట్టదని ఆనందపడుతున్నారు.