AP Crime: మూఢ విశ్వాసానికి గిరిజనుడు హత్య.. ఐదు రోజుల తర్వాత వెలుగులోకి.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
అది ఒక గిరిజన గూడెం. అక్కడ నివసించేది అమాయక గిరిజనం. కానీ వారిలో కొందరికి మూఢ భూతం ఆవహించింది. పాత కక్షలు వాటికి తోడవడంతో అమాయక గిరిజనుడ్ని దారుణంగా హత్య (Murder) చేశారు. చేతబడి నెపంతో చంపి...
అది ఒక గిరిజన గూడెం. అక్కడ నివసించేది అమాయక గిరిజనం. కానీ వారిలో కొందరికి మూఢ భూతం ఆవహించింది. పాత కక్షలు వాటికి తోడవడంతో అమాయక గిరిజనుడ్ని దారుణంగా హత్య (Murder) చేశారు. చేతబడి నెపంతో చంపి పూడ్చిపెట్టారు. మూడు రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య.. తన భర్త అదృశ్యమయ్యాడని (Missing) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. హత్య జరిగిన తరువాత ఐదు రోజులకు వెలుగుచూసిన ఈ ఘటన ఏజెన్సీలో కలకలం సృష్టించింది. విశాఖ (Vizag) జిల్లాలోని ఏజెన్సీ అనేక గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తోంది. గిరిజన గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ చాలా వరకూ గిరిజన మారుమూల గ్రామాల్లో మూఢ భూతం ఇంకా వారిని పట్టి పీడిస్తూనే ఉంది. చేతబడి నెపంతో దాడులు, ప్రతీకార చర్యలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మూఢ భూతం మరో గిరిజనుడిని బలితీసుకుంది.
కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయతీలోని చీడిపల్లి గ్రామానికి చెందిన బోనంగి సోమన్న.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కొంతమందితో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 12న మల్లేశ్వరరావు, కృష్ణారావు, మల్లన్నలతో కలిసి సోమన్న బయటికు వెళ్లాడు. అప్పటినంచి మూడు రోజులైనా అతను ఇంటికి తిరిగి రాలేదు. భర్త రాక కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్న భార్య.. తీవ్ర ఆందోళన చెందింది. సోమన్నను వెంట తీసుకెళ్లిన వారిని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన సోమన్న భార్య సన్యాసమ్మ ఈ నెల 16 న మంప పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. కొయ్యూరు సీఐ స్వామి నాయుడు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలి ఫిర్యాదుతో అనుమానితుల కదలికలపై పోలీసులు ఆరా తీశారు. ఈనెల 12న రాత్రి సోమన్న ను తీసుకెళ్ళిన మల్లేశ్వరరావు, కృష్ణారావు, మల్లన్నలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తామే సోమన్నను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. గ్రామంలోనే హత్యచేసి, శివారులో మృతదేహం పాతి పెట్టినట్టు ఒప్పుకొన్నారు. సోమన్న మృతదేహం పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపించారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలకు తోడు చేతబడి చేస్తున్నాడనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మృతదేహాన్ని బయటకు తీసి రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అరెస్టు చేశారు.
– ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం
Also Read
Hyderabad: యమపాశంలా దూసుకువచ్చిన కారు.. మహిళ స్పాట్‌లో మృతి..
NBK 107 Movie: బాలయ్య సినిమాతో మరో కన్నడ హీరో తెలుగులో స్థిరపడనున్నాడా..?
IPL 2022: ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కే ఓటేసిన సౌతాఫ్రికా.. అందుబాటులోకి ఆ ఆరుగురు..