Guntur Incident: గుంటూరు ఘటనలో నిర్వాహకులపై కేసు నమోదు.. బాధితులకు కొనసాగుతున్న చికిత్స..
డీపీ అధినేత చంద్రబాబు బహిరంగ కార్యక్రమంలో మరోసారి విషాదం జరిగింది. గుంటూరులోని వికాస్ నగర్‌లో చీరలు, కానుకల పంపిణీ దగ్గర తొక్కిసలాట జరిగింది....
చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ ఘటనలో నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాట జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనిని సీరియస్ గా తీసుకున్న అధికారులు చర్యలు చేపట్టారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ కార్యక్రమంలో మరోసారి విషాదం జరిగింది. గుంటూరులోని వికాస్ నగర్‌లో చీరలు, కానుకల పంపిణీ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. స్పాట్‌లోనే ఒక మహిళ చనిపోయింది. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 16 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 15 లారీల్లో కానుకలను పంచేందుకు 15 కౌంటర్లు పెట్టారు. చంద్రబాబు ప్రసంగం పూర్తై వెళ్లిపోయిన తర్వాత.. సంక్రాంతి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే కొన్ని నిముషాల్లోనే ఫస్ట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.
ముందు వైపు ఉన్న బారికేడ్ విరిగిపోవడంతో ముందు ఉన్న మహిళలు కిందపడిపోయారు. వారి మీద కొంత మంది పడటంతో ఊపిరి ఆడక స్పృహ తప్పిపడిపోయారు. గాయపడిన వారిని ముందుగా జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీ ఆస్పత్రికి 8 మందిని.. ప్రజా ఆస్పత్రికి 8 మందిని తరలించారు అధికారులు. గ్రౌండ్‌లోనే రమాదేవి కన్ను మూయడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏర్పాట్లు సరిగా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైద్య శాఖ మంత్రి విడదల రజని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50వేల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. ముగ్గురు చనిపోవడం బాధాకరంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ తరపున 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతే కాకుండా ఉయ్యూరు ఫౌండేషన్ 20 లక్షలు.. టీడీపీ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర 2 లక్షలు.. టీడీపీ నేత డేగల ప్రభాకర్ లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బారికేడ్లు విరిగిపడడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సరిపడా బందోబస్తు ఇచ్చామనీ.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు జిల్లా ఎస్పీ ఆరిఫ్. తొక్కిసలాట జరగడంతో.. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు నియంత్రిచడానికి కూడా వీల్లేకుండా పోయిందన్నారు. మొన్న కందుకూరులో ఇదేం ఖర్మ ప్రోగ్రామ్‌లో 8 మంది చనిపోవడం, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై రాజకీయ దుమారం మొదలైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..