TDP Mahanadu: రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు.. మే 27 నుంచి మూడో రోజుల పాటు పసుపు పండుగ..
Telugu Desam Party: ఏపీలో పసుపు పండుగకు వేదిక దాదాపు ఖరారైంది. రాజమండ్రి వేదికగా మహానాడు జరగబోతోంది. మహానాడు వేదికను ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది టీడీపీ.
Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖరారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే మహానాడు.. ఈ సారి రెండు రోజులకే పరిమితం కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలిరోజు మే 27న సుమారు రెండు లక్షల మంది ప్రతినిధులు వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది.
ఇక.. రెండోరోజున మహానాడు అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో.. దానికి తగ్గట్లు స్థలాన్ని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అధిష్టానం అప్పగించింది. దాంతో.. ఇప్పటికే రెండు చోట్ల టీడీపీ బృందం స్థలాలను పరిశీలించింది. చివరికి.. వేమగిరి గ్రామ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 38ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఇక్కడే వేదిక, భోజన వసతి, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్నానుకుని మరో వందెకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
రాజమండ్రి వేదికపైనుంచే టీడీపీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరిస్తారు. అలాగే.. పలు తీర్మానాలకు ఆమోదం తెలపడంతోపాటు.. రానున్న ఎన్నికలకు మేనిఫెస్టోను కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్ధుల జాబితాను కూడా చంద్రబాబు ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇక.. ఈసారి మహానాడులో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో లభించే ప్రత్యేక వంటకాల్ని వండి అతిధులకు వడ్డించాలని అధిష్టానం నిర్ణయించింది. సుమారు 125 రకాల ఆహార పదార్ధాల జాబితాను రూపొందించింది టీడీపీ అధిష్టానం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..