TDP: చంద్రబాబు సొంత జిల్లాలో సైకిల్ పంచాయితీ.. ఆ అభ్యర్థి వద్దే వద్దు అంటున్న లోకల్ కేడర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో సత్యవేడు సైకిల్ పంచాయతీకి బ్రేకులు పడేలా కనిపించడం లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి వ్యవహారం టీడీపీ హైకమాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. అభ్యర్థి కోనేటి ఆదిమూలం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలుగు తమ్ముళ్ళు స్పష్టం చేస్తున్నారు

TDP: చంద్రబాబు సొంత జిల్లాలో సైకిల్ పంచాయితీ..  ఆ అభ్యర్థి వద్దే వద్దు అంటున్న లోకల్ కేడర్
Tdp Cadre
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 12, 2024 | 4:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో సత్యవేడు సైకిల్ పంచాయతీకి బ్రేకులు పడేలా కనిపించడం లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి వ్యవహారం టీడీపీ హైకమాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. అభ్యర్థి కోనేటి ఆదిమూలం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలుగు తమ్ముళ్ళు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చితేనే పనిచేస్తామంటూ హుకుం జారీ చేశారు. మరోవైపు సత్యవేడు టీడీపీ టికెట్‌ను ఆశించిన జేడీ రాజశేఖర్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానంటూ, ఏకంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు హెలెన్ కోనేటి ఆదిమూలంకు సహకరించేది లేదని స్పష్టం చేయడం టీడీపీ హై కమాండ్‌ను ఆలోచనలో పడేసింది.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఈసారి కూడా ఆపార్టీ టికెట్ ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో సైకిల్ ఎక్కేశారు. కండువా మార్చి అదే సీటులో పోటీకి సిద్ధమయ్యారు. బలమైన కేడర్‌ ఉన్న సత్యవేడులో అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేడర్ నుంచి అసహనం వ్యక్తమవుతోంది. పార్టీకోసం ఇంత మంది కష్ట పడి పనిచేస్తే.. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటి? ఇన్నాళ్లూ ఎవరి మీదైతే పోరాడామో.. అతని కోసమే ఇప్పుడెలా పనిచేయాలంటూ పార్టీని నిలదీస్తోంది లోకల్ సైకిల్ కేడర్.

కోనేటి ఆదిమూలం వద్దే వద్దు అంటూ.. ఏడు మండలాల నేతలు, కార్యకర్తలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అభ్యర్థికి సహకరించేది లేదంటూ లోకల్ కేడర్ గట్టిగా నిర్ణయించుకోవడంతో హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు హెలెన్‌కు దాదాపు టికెట్ ఖరారని ముందుగా కేడర్ భావించింది. కానీ ఆదిమూలం తెరపైకి రావడంతో గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. దీంతో అభ్యర్థికి సహకరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు మాజీ ఎమ్మెల్యే హేమలత.

మరోవైపు టీడీపీ టికెట్‌ను ఆశించిన జేడీ రాజశేఖర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవి చూసిన రాజశేఖర్.. ఈసారి టికెట్ రాకపోవడంతో జనంలోకి వెళ్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోతో జనం ముందుకు వెళ్లి.. అసలైన అభ్యర్థి తానేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ టికెట్ రాకపోతే రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని ఒక హోటల్‌లో సమావేశమైన అసమ్మతి నేతలు.. ఆదిమూలం వద్దు చంద్రబాబు ముద్దు అంటూ నినదించారు. చంద్రబాబును, సైకిల్‌ను చూసి జనాలు ఓట్లేస్తారు. కానీ ఆదిమూలంను చూపించి ఓట్లు అడిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి మాఫియా నడిపిన ఆదిమూలంను కొనసాగిస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కోనేటిని తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు సత్యవేడు అసమ్మతి నేతలు.

ఓవైపు సహకరించని హేమలత వర్గం.. మరోవైపు రెబల్‌గా పోటీ చేస్తా అంటున్నారు. దీంతో ఆదిమూలం ఒంటరివాడిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో సత్యవేడు టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. నామినేషన్ నాటికి అభ్యర్థిగా ఎవరు నిలుస్తారో, కేడర్ ఎవరి వెంట నిలుస్తారో అర్థం కాని పరిస్థితి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles