AP News: అర్ధరాత్రి వృద్ధురాలి అగచాట్లు.. దారి మళ్లించి దోచుకున్న ఆటో డ్రైవర్! ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు
ఓ వృద్ధురాలు గత శనివారం రాత్రి ఆమె నెల్లూరు నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరు బస్టాండ్ లో బస్సు దిగిన మరియమ్మ డిపో బయటకు వచ్చి ఆటో స్టాండ్ లో నిల్చుంది. కొద్దీ సేపటి తర్వాత ఆటో వచ్చి ఆగింది. నంబూరు సమీపంలోని కల్వరి టెంపుల్ వెళ్లాలని చెప్పింది. ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ కాకాని వైపు..

గుంటూరు, మార్చి 16: నెల్లూరు జిల్లాకు చెందిన మరియమ్మ కల్వరి టెంపుల్ కు వెల్తుంటుంది. అనేక సార్లు గుంటూరు వచ్చి అక్కడ నుంచి ఆమె ఆటోలో కల్వరి టెంపుల్‌కు వెళ్ళేది. అదే విధంగా గత శనివారం రాత్రి ఆమె నెల్లూరు నుంచి గుంటూరు వచ్చింది. గుంటూరు బస్టాండ్ లో బస్సు దిగిన మరియమ్మ డిపో బయటకు వచ్చి ఆటో స్టాండ్ లో నిల్చుంది. కొద్దీ సేపటి తర్వాత ఆటో వచ్చి ఆగింది. నంబూరు సమీపంలోని కల్వరి టెంపుల్ వెళ్లాలని చెప్పింది. ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ కాకాని వైపు దూసుకుపోయాడు. అయితే ఉదయ్ ఆసుపత్రి దాటి ఆటో నగర్ లో ప్రవేశించక ముందే ఆటోను దారి మళ్లించాడు. ఆటో దారి మళ్లిన విషయాన్ని గమనించి మరియమ్మ కేకలు వేసింది. అయితే రాత్రి సమయం కావడంతో ఆమె కేకలు ఎవరికి వినిపించలేదు. ఆటో డ్రైవర్ ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇవ్వాలంటూ బెదిరించాడు. ఆమె చేతులకు ఉన్న గాజులు, నాన్ తాడు తెంచుకొని ఆమెను ఆటోలో నుండి కింద పడేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బ్రతుకుజీవుడా అంటూ ఎలాగోలా మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది.
అక్కడ నుండి ఆటో నగర్ సమీపంలోని పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు రాత్రి సమయంలోనే వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆటో ఎక్కిన ప్రాంతం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె ఒంటరిగానే పాత గుంటూరు పీఎస్ వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది దోచుకున్న ప్రాంతం తమ పరిధిలో కాదంటూ కొత్త పేట వెళ్లాలని చెప్పారు. వెంటనే ఆమె కొత్తపేటకు వచ్చి అక్కడ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఆటోను గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు.
అయితే అర్ధరాత్రి సమయంలో ఒంటరి మహిళపై దాడి జరిగితే మూడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం విమర్శలకు తావిచ్చింది. జీరో FIR నమోదు చేసి ఆ తర్వాత ఆ నేరం జరిగిన పోలీస్ స్టేషన్ కు FIR ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉన్నా.. సిబ్బంది అలా చేయకపోవడంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినపడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




