AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎదురుగా పెద్దపులి.. వెంటనే షూట్‌ చేశారు.. అడవిలో ఏం జరిగిందంటే..

పెద్ద పులిని షూట్‌ చేశారంటే తుపాకులతో కాదండోయ్‌... సెల్‌ కెమెరాలతో... ఇంతకీ ఈ షూటింగ్‌ కధాకమామీషు ఏంటంటే.. ప్రకాశం జిల్లా తుమ్మలబైలు దగ్గర ఎపి టూరిజం శాఖ అధ్వర్యంలో ఎకో టూరిజం పేరుతో జంగిల్‌ సఫారీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం చేసిన జంగిల్‌ సఫారీలో పెద్దపులి కనిపించడంతో పర్యాటకుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

Andhra: ఎదురుగా పెద్దపులి.. వెంటనే షూట్‌ చేశారు.. అడవిలో ఏం జరిగిందంటే..
Tiger
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 23, 2025 | 8:14 PM

Share

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన జంగిల్ సఫారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆదివారం వాహనంలో జంగిల్ సఫారి రైడ్‌కు వెళ్లిన నర్సీపట్నం, బెంగుళూరుకు చెందిన పర్యాటకులకు పెద్ద పులి తారసపడింది. దట్టమైన అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద పులిని కనులారా చూసిన వీరు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే పులిని వారి సెల్ ఫోన్‌లలో చిత్రీకరిస్తూ సంతోషపడ్డారు. ఆ పెద్ద పులి తన వైపే చూస్తుందంటూ ఓ బాలుడు ఆశ్చర్యంతో చెప్పాడు.. వీరు గట్టిగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ పులి పక్కకు వెళ్లిపోయింది. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో పర్యాటకులు ఈ జంగిల్ సఫారి రైడ్ చేస్తుంటారు.. ఈ క్రమంలో అటవీలోని వన్యప్రాణులు తారసపడుతూ ఉంటాయి.. పెద్ద పులి అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

తుమ్మలబైలు జంగిల్‌ సఫారీ మనకు దగ్గరే…

జంగిల్‌ సఫారీ అనగానే ఎక్కడో అమెజాన్‌, ఆఫ్రికా అడవుల్లో వన్యమృగాలు, క్రూరమృగాలను వీక్షించేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం శాఖలు ఏర్పాటు చేస్తుంటాయి. అంత పెద్ద స్థాయిలో కాకపోయినా నల్లమల అటవీప్రాంతంలోని తుమ్మలబైలు అటవీప్రాంతంలో ఎకో టూరిజం పేరుతో జంగిల్‌ సఫారీ నిర్వహిస్తున్నారు. ఏపిలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పచ్చని నల్లమల అడవులలో ప్రశాంతమైన, సహజమైన అనుభూతిని కలిగే విధంగా పర్యాటకులకు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేశారు. అటవీప్రాంతంలో 8 కిలో మీటర్ల మేర ఈ సఫారీ రైడింగ్‌ ఉంటుంది. ఈ సఫారీ ట్రిప్ దట్టమైన అడవిలో నుంచి వెళ్తుంది. ఈ ప్రయాణంలో వన్యప్రాణులను, పక్షి జాతులను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే హఠాత్తుగా మీ ఎదుట పెద్దపులి ప్రత్యక్షమైతే… ఒకవైపు భయం, మరోవైపు ఆపుకోలేని యాంగ్జైటీ కలుగుతుంది. ఈ ఆదివారం ఇలాంటి ఘటనే తుమ్మలబైలు జంగిల్‌ సఫారీకి వెళ్ళిన ఓ కుటుంబానికి ఎదురైంది..

ఆదివారం  జంగిల్‌ సఫారీ తుమ్మలబైలు నుంచి దట్టమైన అడవిలోకి వెళ్లగానే సఫారీ వాహనానికి దగ్గరగా ఓ పెద్దపులి సేద తీరుతున్న దృశ్యాలు పర్యాటకుల కంట పడ్డాయి. కుటుంబంతో పాటు వెళుతున్న పర్యాటకులు ఒక్కసారిగా అంతులేని ఆనందానికి గురయ్యారు. అంత దగ్గరనుంచి పెద్దపులిని, అదీ అడవిలో చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. సాధారణంగా పెద్దపులులు సఫారీకి వచ్చే వాహనాలు ప్రయాణించే దారులకు దూరంగా ఉంటాయి. అయితే ఈసారి ఓ పెద్దపులి మాత్రం దారికి దగ్గరలో ఉండటంతో తెగ సంతోషపడిపోయిన ప్రయాణీకులు వెంటనే సెల్‌ఫోన్‌లో పెద్దపులి దృశ్యాలను చిత్రీకరించారు. ఆ ఆనందంలో పిల్లలు కేకలు వేయడంతో పెద్దపులి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఏది ఏమైనా ఈ ప్రయాణం తమ జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చిందని ఆ కుటుంబం తెగ సంతోషపడిపోతోంది.

ఎలా వెళ్లాలంటే..

నల్లమలలో జంగిల్‌ సఫారీకి వెళ్లాలంటే ప్రకాశం జిల్లా దోర్నాల, కర్నూలు జిల్లా శ్రీశైలం మధ్యలో తుమ్మలబైలు చెంచుగూడెం నుండి 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. రోడ్డు మార్గంలో శ్రీశైలం నుంచి 30 కిలోమీటర్లు, మార్కాపురం నుంచి 55 కిలో మీటర్లు, హైదరాబాద్‌ నుంచి 247 కిలో మీటర్లు ఉంటుంది… రైలు మార్గంలో రావాలంటే మార్కాపురం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి 55 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది… ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంగిల్‌ సఫారీ తెరిచి ఉంటుంది… ఒక ట్రిప్పుకు 6 గురికి 2,400 రూపాయలు వసూలు చేస్తారు.

Follow Us