Chiranjeevi: తెలుగు రాజకీయాల్లో మళ్లీ మెగా సౌండ్.. ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న సిగ్నల్స్

రాననుకున్నావా రాలేననుకున్నావా... అనేది మెగాస్టార్‌ పవర్‌ఫుల్ పంచ్ డైలాగుల్లో ఒకటి. నువ్వు రావాల్సిందే అన్నా అంటూ ఇటువైపు నుంచి పిలుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన మాత్రం వస్తాను-రాను అనే రెండు వెర్షన్స్‌ మధ్యలో డైలమానే కంటిన్యూ చేస్తున్నారు.

Chiranjeevi: తెలుగు రాజకీయాల్లో మళ్లీ మెగా సౌండ్.. ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న సిగ్నల్స్
Chiranjeevi Konidela
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 31, 2022 | 1:08 PM

బాస్‌ ఈజ్ బ్యాక్‌ అనే మాటను సినిమా ఫీల్డ్ విషయంలో ఎప్పుడో నిజం చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లో కూడా ‘బాస్‌ ఈజ్ బ్యాక్’ అనే స్లోగన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమాన జనం. నిన్నటికి నిన్న తిరుపతిలో జరిగిన ఒక ఆత్మీయ కలయిక ప్రజారాజ్యం రోజుల్నే రీకాల్ చేసింది. పూర్వ పీఆర్‌పీ నేతలంతా ఒకే వేదికపైకొచ్చి… మెగాస్టారే తమకు ఎప్పటికీ గాడ్‌ఫాదర్ అనేశారు. నాలుగైదు పార్టీల నాయకులున్న ఆ వేదికపై గాడ్‌ఫాదర్ పోస్టరే సెంటరాఫ్ ఎట్రాక్షనైంది.

దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోని నేతలు గాడ్‌ఫాదర్‌కి సైనికుల్లా పని చేయడానికి సిద్ధం అంటూ కమిట్‌మెంట్ ఇచ్చేశారు. అప్పటి ప్రజారాజ్యానికైనా, ఇప్పటికి జనసేనకైనా మెగాస్టారే గాడ్‌ఫాదర్ అని, ఆ మాటకొస్తే జనసేన పుట్టింది ప్రజారాజ్యం నుంచేనని కొత్త లాజిక్ లేవనెత్తారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలన్న ఏకాభిప్రాయమే వ్యక్తమైంది సదరు వేదికమీద. ఇటు… తెలంగాణ నుంచి మెగాస్టార్‌కి అటువంటి ఇన్విటేషన్లే వస్తున్నాయి. నువ్వు రావాల్సిందే అన్నా అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. తన యూనివర్సిటీలో ఇస్కాన్‌ సంస్థ వాళ్లు నిర్వహించిన క్యాన్సర్ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో… చీఫ్‌ గెస్ట్‌ మెగాస్టార్ చిరంజీవి. ఆ సందట్లో మల్లారెడ్డి చేసిన సడేమియా పొలిటికల్‌గా కాక రేపింది. బీఆర్‌ఎస్‌కి సపోర్ట్ ఇవ్వాలన్నా అంటూ మల్లారెడ్డి చేసిన రిక్వెస్ట్‌కు సున్నితంగా తిరస్కరించారు చిరంజీవి.

జనసేనకు అన్నయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటూ మెగాబ్రదర్ నాగబాబు కూడా రిపీటెడ్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం తమ్ముడు పవన్‌కల్యాణ్‌తోనే సన్నిహితంగా ఉంటూ… జనసేనలో కీలకంగా కనిపిస్తున్న నాగబాబు… అన్నయ్య చిరంజీవిని కూడా జనసేనకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ సినిమాటిక్ స్టయిల్‌లో ఇస్తున్న సిగ్నల్స్ కూడా మెగా ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.  ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా నా ఉనికి నా తమ్ముడికి సాయపడితే అంతకంటే ఆనందం ఏముంది అని చిరంజీవే ఓపెన్‌గా చెప్పేశారు. ఇటువంటి స్టేట్‌మెంట్స్‌ జనసేన క్యాడర్‌కి బూస్ట్‌నిచ్చేవే.

ఆన్‌స్క్రీన్‌లోను, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ ఇలా మెగాసిగ్నల్స్‌ తరచూ వినిపించడం ఆసక్తికరంగా మారింది. తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణమిది. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూ కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇదే గ్యాప్‌లో మెగా పొలిటికల్ ఫ్లేవర్లు కూడా పుట్టుకురావడంతో రాజకీయాల్ని డ్రమటిక్‌గా మార్చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..