Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండక్కి సెలవు కోసం ఆయాల గొడవ.. ఆకలికి అలమటించి శిశుగృహలో పసికందు మృతి!

Anantapur ICDS Shishu Gruha issue: దసరా పండక్కి సెలవివ్వలేదన్న కోపంతో ఓ పసికందు ఉసురు తీశారు శిశుగృహ సిబ్బంది. చేసిన పాపం కప్పెయ్యాలని గుట్టుచప్పుడుకాకుండా మట్టిలో శిశువు మృతదేహాన్ని పూడ్చేశారు. అయితే చేసిన పాపం అనూహ్యంగా బయటకు పొక్కడంతో స్థానికంగా కలకలం రేగింది..

పండక్కి సెలవు కోసం ఆయాల గొడవ.. ఆకలికి అలమటించి శిశుగృహలో పసికందు మృతి!
Anantapur Shishu Gruha Issue
Srilakshmi C
|

Updated on: Oct 05, 2025 | 12:32 PM

Share

అనంతపురం, అక్టోబర్‌ 5: అప్పుడే పుట్టిన పసికందును పోషించలేక తల్లి చేతులెత్తేస్తే.. అధికారులు ఆ బిడ్డను శిశుగృహలో ఉంచారు. అక్కడి సిబ్బంది కడుపులో పెట్టుకుని లాలిస్తారని అనుకుంటే.. దసరాకు సెలవివ్వలేదన్న కోపంతో ఆ పసికందు ఉసురు తీశారు సిబ్బంది. చేసిన పాపం కప్పెయ్యాలని గుట్టుచప్పుడుకాకుండా మట్టిలో శిశువు మృతదేహాన్ని పూడ్చేశారు. అయితే చేసిన పాపం అనూహ్యంగా బయటకు పొక్కింది. అనంతపురంలోని ఐసీడీఎస్‌ అనుబంధ శిశుగృహలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఒకరోజు ఆలస్యంగా శనివారం (అక్టోబర్‌ 4) వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ.. తనకు జన్మించిన మగ శిశువును పోషించలేక ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్‌ అనుబంధ శిశుగృహకు అప్పగించింది. అప్పటి నుంచి ఆ శిశువు సంరక్షణ కేంద్రంలోనే ఉంటున్నాడు. అయితే అక్టోబర్‌ 2వ తేదీన దసరా పండగ కావడంతో ఆ రోజు రాత్రి ఇద్దరు ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉంది. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే విధులకు వచ్చారు. ఏం జరిగిందో తెలియదుగానీ అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి బిడ్డను హుటాహుటీన తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే శిశువు మృతి చెందినట్లు చెప్పారు.

ఇది బయటకు పొక్కకుండా శ్మశానంలో పూడ్చేశారు. ఇంతలో అక్కడ శిశుసంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది మధ్య గొడవలు తలెత్తడంతో ఈ విషయం బయటకు పొక్కింది. పండగరోజు సెలవివ్వలేదనీ ఆయా అయిష్టంగా విధులకు వచ్చింది. ఆ రోజు విధులకు వచ్చే విషయంలోనూ అక్కడి సిబ్బందికి విభేదాలు వచ్చాయి. దీంతో విధుల్లో ఉన్న ఆయా పాలు పట్టించకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో శిశువు ఆకలికి అలమటించి మృతి చెందాడు. అయితే అనారోగ్యం కారణంగా బిడ్డ చనిపోయిందంటూ ఐసీడీఎస్‌ పీడీ నాగమణి తెరచాటు యవ్వారాలు నడపడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్‌ ఆనంద్‌ దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ పీడీని ఆదేశించారు. మరోవైపు రంగంలోకి దిగిన మంత్రి సంధ్యారాణి ఐసీడీఎస్‌ శిశుగృహంలో పసికందు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.