AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో కదనోత్సాహం.. ముగ్గురు మాజీ ఎంపీల భేటీ
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీసీసీ నాయకులను ఢిల్లీకి పిలిచి మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఏపీ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు.

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సైతం కాంగ్రెస్ గూటికి వెళ్తానని బాహటంగానే చెప్పారు. వైసీపీలో టికెట్లు దక్కని కొందరు నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సంక్రాంతి తరువాత ఏపీలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోతాయంటున్నారు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. ఈ క్రమంలోనే మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారిద్దరూ కాసేపు చర్చలు జరిపిన తర్వాత మరో మాజీ ఎంపీ ఉండవల్లిని కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల్లో మాజీ ఎంపీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముగ్గురు కీలకనేతల కలయికలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నట్టు కనబడుతోంది.
అయితే భేటీ అనంతరం లగడపాటి కీలక కామెంట్స్ చేశారు. హర్షకుమార్, ఉండవల్లి రాజకీయాల్లో కొనసాగాలన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పోటీచేసే ఛాన్సే లేదని.. మాటకు కట్టుబడే ఉంటానన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు లగడపాటి. రాజకీయాల్లో రావాలనే ఆలోచన లేదు, పోటీ చేయాలనే కోరికా తనకు లేదని తెలిపారు.
కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏపీపై కూడా ఫోకస్ పెట్టింది. సౌత్‌లో మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఏపీ పీసీసీ బాధ్యతలను షర్మిలకు అప్పగించి.. ఇతర పార్టీల్లో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలకు ఘర్ వాపసీ పిలుపు ఇచ్చింది. రాహుల్ గాంధీపై ఏపీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఏపీసీసీ నాయకులను ఢిల్లీకి పిలిచి మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఏపీ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి తమతోనే సాధ్యమని చెబుతుంది కాంగ్రెస్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…