AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగర వాసులకు తాగునీటి కష్టాలు తీరినట్లే.. తీపి కబురు చెప్పిన జలమండలి.!

భాగ్యనగరవాసులకు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3 ప్రాజెక్ట్ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని జ‌ల‌మండ‌లి ఎండీ అధికారుల‌ను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ అశోక్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల నిర్మాణ పనులపై సమీక్షించారు.

భాగ్యనగర వాసులకు తాగునీటి కష్టాలు తీరినట్లే.. తీపి కబురు చెప్పిన జలమండలి.!
Hyderabad Water Works
Laxmikanth M
| Edited By: |

Updated on: Jan 08, 2026 | 9:26 PM

Share

భాగ్యనగరవాసులకు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3 ప్రాజెక్ట్ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని జ‌ల‌మండ‌లి ఎండీ అధికారుల‌ను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ అశోక్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల నిర్మాణ పనులపై సమీక్షించారు. హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనంకోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ. 7,360 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్రాజెక్టు పనులను జలమండలి చేపట్టింది.

మాస్టర్ ఫ్లాన్‌లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైప్ లైన్ విస్తరణ పనులపై చర్చించారు. ఘన్ పూర్ వ‌ద్ద నిర్మించ‌నున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్ పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల వద్ద నిర్మించే నీటి శుద్ది కేంద్రాల ప‌నుల‌లో వేగం పెంచాలని అధికారుల‌ను ఎండీ ఆదేశించారు. ఏకకాలంలో నీటి శుద్ది కేంద్రాల నిర్మాణ ప‌నుల‌ను, పైప్ లైన్ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

గోదావరి డ్రింకింగ్‌ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద.. మహానగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో.. 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలున్నాయని వాటర్ వర్క్స్ ఎండీ తెలిపారు. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది.. మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం చేసేందుకు సాధ్యమవుతుందన్నారు.

ఈ ప్రాజెక్టులో పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3000 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతే కాకుండా ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు.. ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2,3 ద్వారా 300 ఎంజీడీల నీరు సరఫరాకు సాధ్యమవుతుందని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..