AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Kumar Reddy: మాజీ సీఎం రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేదీ ఆ రోజే.. పాతుకుపోతారా..? ప్యాకప్ చెబుతారా..?

నల్లారి కిరణ్, నల్లారి కిషోర్. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరు స్వయాన అన్నదమ్ములే, అయినా పార్టీలు మాత్రం పేరు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Kiran Kumar Reddy: మాజీ సీఎం రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేదీ ఆ రోజే.. పాతుకుపోతారా..? ప్యాకప్ చెబుతారా..?
Nallari Kiran Kumar Reddy Ppeddireddy Ramchandra Reddy
Raju M P R
| Edited By: |

Updated on: May 28, 2024 | 9:39 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమా వారిదే. అధికారంపై నమ్మకాలు ఆధిక్యతపై అంచనాలు వేసుకోవడం రాజకీయ పార్టీల పనైంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం అందరి దృష్టి నల్లారి సోదరులపైనే ఉంది. పీలేరు, రాజంపేట పార్లమెంటులో పోటీ చేస్తున్న నల్లారి బ్రదర్స్ ఓటమి లక్ష్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫైట్ చేయడంతో ఆసక్తి నెలకొంది. రెండు చోట్లా మైనారిటీ ఓట్లే కీలకం కావడంతో నల్లారి బ్రదర్స్‌కు విన్నింగ్ ఛాన్స్ అంత ఈజీ కాదని వైసీపీ లెక్కలేస్తోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై వ్యతిరేకత నల్లారి అన్నదమ్ముల మధ్య ఐక్యతతో విజయం ఖాయమని కూటమి కాన్ఫిడెన్స్‌తో ఉంది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరు స్వయాన అన్నదమ్ములే, అయినా పార్టీలు మాత్రం పేరు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఈ రెండు నియోజకవర్గాలపైన పడింది.

రాజకీయంగా పెద్దిరెడ్డి – నల్లారి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతుండటంతో ఇక్కడ పోటీ కూటమి – వైసీపీ మధ్య కంటే పాత కాపుల మధ్య అన్నట్లు సాగింది. దీంతో నల్లారి సోదరుల పోరు పెద్దిరెడ్డి కుటుంబంపై అన్నట్లు ఆసక్తికరంగా సాగింది. పీలేరులో నల్లారి కిషోర్ పై చింతల రామచంద్రారెడ్డిని తిరిగి బరిలో నిలిపిన పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన నల్లారి కిరణ్ పై ఎంపీ మిథున్ రెడ్డిని పోటీలో దింపారు. దీంతో నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది.

దాదాపు 5 దశాబ్దాలుగా నల్లారి, చింతల కుటుంబాల మధ్య సాగుతున్న రాజకీయ వైరం గత కొన్నేళ్లుగా నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. అనూహ్యంగా రాజంపేట పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం, సిట్టింగ్ ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ పడటంతో బిగ్ ఫైట్ నడిచింది.

రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ లో కిరణ్, పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ బరిలో ఉండటంతో ఫైట్ పీక్స్ కు చేరింది. 2014, 2019 ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2024 తిరిగి బరిలో నిలిచిన కిషోర్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఫైట్ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి టార్గెట్ గా పోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం అంతా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, చాలెంజ్ లు, సత్య ప్రమాణాలుతో మాటల తూటాలు పేలగా, ప్రధాని నరేంద్ర మోదీ తోపాటు సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నేతల ప్రచారం మరింత హోరెత్తించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి నల్లారి సోదరుల గెలుపు కోసం శ్రమించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ గానే చంద్రబాబు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరగడం తమకు అనుకూలమంటే తమకే అనుకూలమన్న ధీమాతో రెండు కుటుంబాలు ఉన్నాయి.

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 16,33,759 మంది ఓటర్లు ఉండగా 13,17,747 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో దాదాపు 2.60 లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉండగా, కీలకంగా మారిన మైనారిటీ ఓటింగ్ ను వైసీపీ, కూటమి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పీలేరు అసెంబ్లీ లో 2,34,608 ఓటర్లు ఉండగా 1,90,234 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.09 శాతం మంది ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియదు కానీ పెద్దిరెడ్డి – నల్లారి కుటుంబాల మధ్య జరిగిన బిగ్ ఫైట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు జనానికి దూరంగా ఉండి ఆస్తులు కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారని, జూన్ 4 తరువాత సూట్ కేస్‌తో హైదరాబాద్ బయలుదేరుతాడని పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఈ ఎన్నికలు పెద్దిరెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని నల్లారి కుటుంబం చేసిన సవాళ్లు, వార్నింగ్ లకు ఓటర్లు ఇచ్చే తీర్పే సమాధానం చెప్పాల్సింది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…