Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో ఉల్లిపాయలు కనిపిస్తాయి. శాఖాహారుల నుంచి మాంసాహారుల వరకు అందరూ ఉల్లిపాయలు తింటారు. ఎందుకంటే ఉల్లిపాయలు లేకుండా ఏ వంట పూర్తికాదు. అంతేకాదు ఇవి లేనితే వంటలకు రుచి కూడా రాదు. అందుకే చాలా మంది వీటిని అధిక మొత్తంలో మార్కెట్లో కొనుగోలు చేసి..

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో ఉల్లిపాయలు కనిపిస్తాయి. శాఖాహారుల నుంచి మాంసాహారుల వరకు అందరూ ఉల్లిపాయలు తింటారు. ఎందుకంటే ఉల్లిపాయలు లేకుండా ఏ వంట పూర్తికాదు. అంతేకాదు ఇవి లేనితే వంటలకు రుచి కూడా రాదు. అందుకే చాలా మంది వీటిని అధిక మొత్తంలో మార్కెట్లో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఉల్లి మొలకెత్తడం చూస్తూనే ఉంటాం. ఇలా మొలకెత్తిన ఉల్లిని తినడం సురక్షితమేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విధంగా మొలకెత్తిన ఉల్లిపాయలను తినకూడదని కొందరు భావిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం మొలకెత్తిన ఉల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనిని తినడంలో ఎటువంటి సమస్య లేదని చెబుతున్నారు. నిజానికి.. మొలకెత్తిన ఉల్లి తినడం మంచిదా? కాదా? అనే విషయం నిపుణులు మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
నిల్వ ఉల్లిపాయలకు వచ్చే పచ్చి మొలకలు విషపూరితమైనవి కావు. నిజానికి ఉల్లిపాయ పాతబడి కొంత తేమను పొందినప్పుడు అది మళ్ళీ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. రోజులు గడిచేకొద్దీ దాని నుంచి పచ్చని ఆకు ఉద్భవిస్తాయి. ఈ ఆకులు తినడం ఆరోగ్యానికి మంచిది. భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఉల్లిపాయలు తినడానికి సురక్షితమే అయినప్పటికీ వాటి లక్షణాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉల్లిపాయలు మొలకెత్తినప్పుడు, లోపలి భాగం కొద్దిగా మృదువుగా, లేతగా మారుతుంది.
ఈ ఉల్లిపాయలు సాధారణ ఉల్లిపాయల మాదిరిగా రుచిగా ఉండకపోవచ్చు. వాటికి కొంచెం చేదు రుచి ఉంటుంది. మీరు వంట చేసేటప్పుడు మొలకలను కోసి సలాడ్లు వంటి ఇతర ఆహారాలలో వాడవచ్చు. వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వాటిని తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మొలకెత్తిన ఉల్లిపాయ నొక్కినప్పుడు చాలా మృదువుగా లేదా పొడిగా ఉంటే, అలాగే వాటిపై నల్ల మచ్చలు ఉంటే అలాంటి వాటిని ఉపయోగించవద్దు. ఇటువంటి ఉల్లిపాయలు ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




